తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పిన ప్రజా కవి కాళోజి 110వ జయంతి వేడుకలు

  1. సూర్యాపేటలో కాళోజి 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ.
  2. కాళోజి రాసిన “నా గొడవ” మనందరి గొడవగా పేర్కొన్న వక్తలు.
  3. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రజా కవి కాళోజికి ఘన నివాళి.

సూర్యాపేటలో శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు 110వ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వక్తలు కాళోజి రాసిన కవిత్వం ప్రజల హక్కుల కోసం చైతన్యం తీసుకువచ్చిందని పేర్కొన్నారు.

సూర్యాపేట, సెప్టెంబర్ 06:
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ శ్రీ కళావేదిక సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రజా కవి, పద్మభూషణ్ కాళోజి నారాయణరావు 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

జిల్లా అధ్యక్షులు డా. పోతుగంటి వీరాచారి మాట్లాడుతూ, కాళోజి నారాయణరావు తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన అక్షర తపస్వి అని, ఆయన కవిత్వం తెలుగు భాషకు, తెలంగాణ యాసకు అద్భుతంగా నిలిచిందని అన్నారు. కాళోజి స్ఫూర్తి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు.

ప్రధాన కార్యదర్శి గుండెపురి ఉపేంద్ర చారి మాట్లాడుతూ, కాళోజి అన్యాయంపై తన కలాన్ని వినిపించి, ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు. కాళోజి మాటలు, “పుట్టుక నీది, చావు నీది, బతుకంతా సమాజానిదే” అని ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చాయని గుర్తు చేశారు.

కన్వీనర్ హమీద్ ఖాన్ మాట్లాడుతూ, కాళోజి రాసిన “నా గొడవ” కవిత్వం ప్రజా సమస్యలను చర్చించిన గొప్ప రచన అని, కాళోజి అందించిన సాహిత్యం సమాజానికి మార్గదర్శకంగా మారిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పూసొజు పద్మ, పిన్నెల్లి వెంకటేష్, పెరుమళ్ళ రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment