ఆ రెండు విమానాల లక్ష్యం ఏమిటి?

90

హెడింగ్లీ: లండన్‌లోని హెడింగ్లీ వేదికగా శ్రీలంక-భారత్ జట్ల మధ్య శనివారం జరిగిన ప్రపంచ కప్‌ వన్డే మ్యాచ్‌‌లో ఓ వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం మీద నుంచి అనుమానాస్పదంగా ఓ విమానం రెండు సార్లు చక్కర్లు కొట్టింది. ఆ విమానం జండాలను ఎగురవేస్తూ సంచరించడాన్ని బీసీసీఐ తప్పుబట్టింది. జస్టిస్ ఫర్ కశ్మీర్, భారత్ హింస వీడనాడాలి, కశ్మీర్‌కు స్వేచ్ఛనివ్వాలి అనే భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో కూడిన బ్యానర్‌లను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

‘‘ఇది ఆమోదించదగ్గ అంశం ఎంతమాత్రం కాదు. ఇదే విషయమై ఐసీసీకి రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశాం. హెడింగ్లేలో ప్రదర్శించిన బ్యానర్లపై ఆందోళన వ్యక్తం చేశాం. ఇలాంటి సంఘటన సెమీఫైనల్లో కూడా పునరావృతమైతే అది నిజంగా చాలా దురదృష్టకరం. మా ఆటగాళ్ల భద్రత, రక్షణ మాకు అత్యంత ప్రధానమైనవి’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

భారత్, శ్రీలంక మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంపై చక్కర్లు కొట్టిన ఓ విమానం ‘జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌’అనే వ్యాఖ్యలతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. కాసేపటికి అదే విమానం ‘భారత్‌ హింస వీడనాడాలి, కశ్మీర్‌కు స్వేచ్ఛ నివ్వాలి’ అనే బ్యానర్‌ ప్రదర్శించింది. ఇంతకు ముందు ఇక్కడే (లీడ్స్‌) పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘జస్టిస్‌ ఫర్‌ బలూచిస్థాన్‌’ నినాదాలతో కూడిన బ్యానర్లు కనిపించాయి.