లంకపై విజయంతో పట్టికలో అగ్రస్థానం!

115

హెడింగ్లీ: ఎన్ని రకాల క్రీడలున్నా వాటిలో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు దేశీయంగా కబడ్డీ ఆటకు మంచి గుర్తింపు ఉండేది. ఇప్పుడు అంతకుమించిన క్రేజ్ క్రికెట్‌కు వచ్చింది. ఇక క్రికెట్ అంటేనే రికార్డుల పరంపర. అందులోనూ ఈసారి ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగించేశారు. లండన్ వేదికగా జరుగుతున్న దాదాపు అన్ని మ్యాచ్‌లలో భారత్ తన సత్తాచాటుకుని పలు అంశాలలో ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా శనివారం హెడింగ్లీలో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

265 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ తరువాత దూకుడు పెంచింది. దీంతో 43.3 ఓవర్లలోనే 3 వికెట్లను మాత్రమే నష్టపోయి భారత్ 265 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇండియా లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించి 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అంతకముందు, టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌మెన్లలో ఏంజెలో మాథ్యూస్ (128 బంతుల్లో 113 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో రాణించాడు.

మరో బ్యాట్స్‌మన్ లాహిరు తిరిమన్నె (68 బంతుల్లో 53 పరుగులు, 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇక భారత బౌలర్లలో జస్‌ప్రిత్ బుమ్రా 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు తలా 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ ఆరంభంలో ఆచి తూచి ఆడినా క్రమంగా స్పీడు పెంచింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్‌మెన్ లంక బౌలర్లను పరుగెత్తించారు. లోకేష్ రాహుల్, రోహిత్ శర్మలు తొలి వికెట్‌కు 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత భారత్ 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

కాగా భారత బ్యాట్స్‌మెన్లలో లోకేష్ రాహుల్ (118 బంతుల్లో 111 పరుగులు, 11 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (94 బంతుల్లో 103 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సెంచరీలతో రాణించారు. ఇక లంక బౌలర్లలో లసిత్ మలింగ, కసున్ రజిత, ఇసురు ఉదానాలు తలా 1 వికెట్ తీశారు. అంతకముందు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్, అఫ్ఘనీస్థాన్ వంటి జట్లతో జరిగిన మ్యాచ్‌లలో కూడా టీమిండియా తన ఆటతీరును ప్రదర్శించింది.