పీఎన్‌బీని వీడని మోసాలు!

60

న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఉదంతంతో ఇప్పటికే పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తాజాగా మరో కుంభకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.3,800 కోట్లకుపైగా మోసాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. బ్యాంక్‌కు రూ.3,805.15 కోట్లు బకాయిపడ్డ భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ ఈ రుణాలను మోసపూరితంగా పొందినట్లు గుర్తించామని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

ఈ సమాచారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు నివేదించినట్లు స్టాక్ ఎక్సేంజ్‌లకు బ్యాంక్ యాజమాన్యం తెలియజేసింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ దర్యాప్తు, కంపెనీ డైరెక్టర్లపై సూమోటోగా నమోదు చేసిన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ రుణాల సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించామని కూడా వెల్లడించింది. దేశీయంగా రూ.3,191.51 కోట్లు, విదేశాల్లో దుబాయ్ శాఖకు సుమారు రూ.345.74 కోట్లు, హాంకాంగ్ శాఖకు దాదాపు రూ.267.90 కోట్లు భూషణ్ పవర్ అండ్ స్టీల్ యాజమాన్యం బకాయిపడినట్లు ఈ సందర్భంగా పీఎన్‌బీ వివరించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి సంస్థ ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది.

భూషణ్ పవర్ అండ్ స్టీల్ దివాలా తీయగా, దాని రుణాలు మొండి బకాయిలుగా మారాయి. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఉండగా, ఆశాజనక రికవరీ ఉంటుందన్న విశ్వాసంతో బ్యాంక్ ఉంది. అసలే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల రూ.14,000 కోట్ల కుంభకోణంతో బయటపడ్డ బ్యాంక్ లోపాలను కప్పిపుచ్చుకోలేకపోతోంది పీఎన్‌బీ. ఈ సమయంలో ఇప్పుడు భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణాలు కూడా మోసం చేసి తీసుకున్నవేనని తేలడం ఆ బ్యాంక్ పాలనా వ్యవస్థను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది.

మరోవైపు, పీఎన్‌బీ, మరికొన్ని బ్యాంకులకు రూ.7,200 కోట్లకుపైగా సొమ్మును వడ్డీతో చెల్లించాలని నీరవ్ మోదీ, ఆయన అనుచరులను రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) పుణె ధర్మాసనం ఆదేశించింది. పీఎన్‌బీ రూ.14,000 కోట్ల మోసంలో ప్రధాన నిందితుడుగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

గతేడాది రూ.7,029 కోట్లకుపైగా రికవరీ కోసం డీఆర్టీని పీఎన్‌బీ ఆశ్రయించింది. ఆ తర్వాత ఓబీసీ, బీవోబీ, బీవోఐ, యూకో, కార్పొరేషన్, యునైటెడ్, బీవోఎం తదితర బ్యాంకులూ రూ.232 కోట్ల రికవరీ దావాను వేశాయి. దీంతో నిరుడు జూన్ 30 నుంచి 14.30 శాతం వార్షిక వడ్డీతో ఈ మొత్తాలను చెల్లించాలని నీరవ్, ఇతరులను డీఆర్టీ ఆదేశించింది.