ఏపీ వ్యాపారి హత్యపై కీలక ఆధారాలు లభ్యం?

62

హైదరాబాద్: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ హత్యోదంతంపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం రాత్రి కత్తిపోట్లకు గురైన రాంప్రసాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి పంజాగుట్ట వేంకటేశ్వర ఆలయం దైవదర్శనం చేసుకొని వెళ్తుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి కత్తులతో అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో రాంప్రసాద్‌ పొట్టపై తగలకుండా చేతులతో అడ్డుకున్నారు.

దీంతో తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారని ఎస్సై శ్రీనివాసులు‌ తెలిపారు. రాంప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇతనికి విజయవాడలో చిన్నతరహా ఉక్కు కర్మాగారం ఉందని అక్కడ గతంలో కోగంటి సత్యం అనే వ్యాపార భాగస్వామితో పాతకక్షలున్నాయని కుటుంబీకులు తెలిపారు. అతడి నుంచి తరచూ బెదిరింపులు వచ్చేవని, ఆయనే కిరాయి హంతకులతో హత్య చేయించి ఉంటారని కుటుంబీకులు అనుమానిస్తున్నారు.

ఈ హత్యకు సంబంధించి పోలీసులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌, ఎస్సై శ్రీనివాసులు, సతీశ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, పశ్చిమ మండలి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, వ్యాపారవేత్త రాంప్రసాద్‌ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు. తనపై ఆరోపణల వెనుక టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌తో ఆయన మాట్టాడారు.

కామాక్షి స్టీల్స్‌‌లో తనతో పాటు బొండా ఉమ కూడా వ్యాపార భాగస్వామిగా ఉండేవాడన్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు బొండా ఉమ తన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్‌కు విక్రయించాడన్నారు. రాంప్రసాద్‌ తనకే రూ. 23 కోట్లు ఇవ్వాలన్నారు. రాంప్రసాద్‌ను చంపితే తనకు డబ్బులు ఎవరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తనకు డబ్బులు ఇవ్వాలని అడిగినప్పుడల్లా తనపై తప్పుడు కేసులు పెట్టారని రాంప్రసాద్‌పై సత్యం ఆరోపణలు చేశాడు. రాంప్రసాద్‌ను చంపాలంటే తనకు ఒక్క నిమిషం పని కాదన్నారు. తాను సైగ చేస్తే రాంప్రసాద్‌ను విజయవాడలోనే చంపేసే వారన్నారు.

కానీ, తనకు ఆ ఉద్దేశ్యం లేదన్నారు. రాంప్రసాద్ హత్య విషయంలో తనపై ఆరోపణలు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడం వెనుక కూడా బొండా ఉమ ఉన్నాడని ఆయన ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను వైఎస్ఆర్‌సీపీ అనుకూలంగా ప్రచారం చేయడం వల్లే బొండా ఉమా కక్షగట్టారని ఆయన ఆరోపించారు. మేరీ క్యాస్టింగ్ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆదివారం ఉదయం టీవీలో వార్తలు చూసే వరకు కూడా రాంప్రసాద్ హత్య చేసిన విషయం తనకు తెలియదన్నారు. రాంప్రసాద్‌కు అతని బావమరిదితో కూడా గొడవలున్నాయన్నారు.

తనతో పాటు చాలా మందికి కూడా రాంప్రసాద్‌ డబ్బులు ఇవ్వాలన్నారు. రాంప్రసాద్ హత్య విషయంలో పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం తాను తిరుపతికి వెళ్లానని, అక్కడి నుండి చికిత్స కోసం హైద్రాబాద్‌కు తిరిగి వచ్చినట్టుగా ఆయన తెలిపారు. రాంప్రసాద్‌ను తాను ఏనాడూ కూడా బెదిరించలేదని ఆయన చెప్పారు.