బడ్జెట్ పన్నుల దెబ్బకు పెరిగిన పెట్రో ధరలు

137

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పన్నుల భారం ఒక్కసారిగా పెట్రో చార్జీలపై పడింది. ఇంత వరకూ అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలకు అనుగుణంగా హెచ్చుతగ్గులతో ఉన్న ఇంధన ధరలకు పన్నుల భారం తోడవడంతో సామాన్యుడి నడ్డివిరిగే పనైంది. పరుగులు తీస్తున్న పెట్రో ధరలను పన్నుల పెంపు ప్రభావం మరింత ముందుకు ఎగదోసినట్లయింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై రూపాయి చొప్పున ఎక్సైజ్ సుంకం, మరో రూపాయి మేరకు రోడ్డు, మౌలిక రంగ సెస్సును విధించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటర్‌కు రూ. 2.50కుపైగా పెరిగాయి. స్థానిక అమ్మకాల పన్ను లేదా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కలిసి ఈ భారం మరింత పెరిగినట్లయింది.

ఈ ధరల పెరుగుదల ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.2.60 ఎగిసి రూ.77.48ని తాకింది. అదే విధంగా డీజిల్ రూ.2.56 ఎగబాకి రూ. 72.62ను చేరింది. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై రూ.2.45, డీజిల్‌పై రూ.2.36 చొప్పున పెంపు కనిపిస్తోంది. అక్కడ పెట్రోల్ ధర రూ.72.96, డీజిల్ ధర రూ. 66.69కి వెళ్లాయి. కాగా, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) జారీచేసిన వివరాల ప్రకారం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బంకుల్లో ఈ ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్రం పన్నుల వాటా తాజా పెంపుతో మరింత పెరిగింది. పెట్రోల్ ధరలో రూ.19.98కి, డీజిల్ ధరలో రూ.15.83కు చేరింది. ప్రస్తుతం పెట్రోల్‌పై కనీస ఎక్సైజ్ సుంకం రూ.2.98, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూ.8, రోడ్డు-మౌలిక రంగ సెస్సు రూ.9గా ఉన్నది. డీజిల్‌పై కనీస ఎక్సైజ్ సుంకం రూ.4.83, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం రూ.2, రోడ్డు-మౌలిక రంగ సెస్సు రూ.9గా ఉన్నది. బడ్జెట్ బాదుడుతో కేంద్రానికి ఏటా రూ.24,000 కోట్ల నుంచి 28,000 కోట్లదాకా ఆదాయం పెరిగింది. ఇక టన్ను ముడి చమురుపై కస్టమ్స్ లేదా దిగుమతి సుంకాన్ని రూ.1 విధిస్తున్నట్లు మంత్రి బడ్జెట్‌లో చెప్పారు. దేశంలోకి ఇప్పుడు 220 మిలియన్ టన్నులకుపైగా ముడి చమురు దిగుమతి అవుతోంది. దీంతో కేంద్రానికి అదనంగా రూ.22 కోట్ల ఆదాయం దక్కనుంది.

ప్రస్తుతం ముడి చమురుపై టన్నుకు రూ.50 చొప్పున జాతీయ విపత్తు అగంతుక సుంకాన్ని (ఎన్‌సీసీడీ) మాత్రమే వసూలు చేస్తోంది. కాగా, పెరిగిన పెట్రో ధరలతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులైంది. వాహన నిర్వహణ భారమేగాక ఎగిసే నిత్యవసరాల ధరలు పేద, మధ్యతరగతి ప్రజలను ఉక్కిరిబిక్కిరే చేయనున్నాయి. ఇప్పటికే పండ్లు, కూరగాయలు, పాలు, గడ్లు, మాంసం, చేపలు, ఉల్లి, పప్పుధాన్యాలు, తృణధాన్యాల ధరలు ఠారెత్తిస్తున్నాయి. తాజా పెట్రో భారంతో రవాణా వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు వీటన్నిటి ధరలను మరింత పైకి చేర్చుతున్నాయి.

ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సంస్థలు త్వరలోనే తమ ఉత్పత్తులన్నిటి ధరలను సవరించే వీలుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం రూ.500 కోట్లకుపైగా భారం పెరుగనుందని వారు అంచనా వేస్తున్నారు. బడ్జెట్ నిర్ణయంతో ఓ సామాన్య కుటుంబ నెలవారీ ఖర్చులు సైతం రూ.1,000 నుంచి రూ.1,500లు పెరుగవచ్చని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.