ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నంబర్ల వ్యాపారం భేష్

181

హైదరాబాద్: కొత్త బండి లేదా కారు కొన్నాక మంచి నంబర్​ కోసం చూస్తుంటారు ఓనర్లు. ఫ్యాన్సీ నంబర్​ వస్తే ఆ కిక్కే వేరప్పా అనుకునేటోళ్లు బోలెడు మంది ఉంటారు. అయితే, ఆ నంబర్​ కోసం చాన్నాళ్లు వేచి చూడాల్సి వస్తోందిప్పుడు. ఆ తిప్పలు తప్పించేందుకు ఆన్​లైన్​లోనే ఫ్యాన్సీ నంబర్​ను బుక్​ చేసుకునే కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది ఆర్టీఏ. మరో నెలన్నరలో ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

దీని కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఆన్​లైన్​లో నంబర్​ను ఎంపిక చేసుకుని నెట్​బ్యాంకింగ్​ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. దానికి రిజర్వేషన్​, ప్రాసెసింగ్​ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది ఆ నంబర్​ కోసం దరఖాస్తు చేసుకుంటే, వేలం నిర్వహిస్తారు. ఆ వేలంలో నంబర్​ రాని వ్యక్తులకు డబ్బును తిరిగి రిఫండ్​ చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో టీఎస్​ 09 ఎఫ్​సీ 9999 నంబర్​ ₹9 లక్షలు పలికింది.

కానీ, ఇటీవల హైదరాబాద్​ మేయర్​ బొంతు రామ్మోహన్​ పేరుతో టీఎస్​ 09 ఎఫ్​డీ 9999 నంబర్​ను కేవలం ₹50 వేలకే దక్కించుకున్నారు. దీంతో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకటే బిడ్​ రావడంతో ఆ నంబర్​ను మేయర్​కు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఆన్​లైన్​ విధానం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలకు చెక్​పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్​ కావాలంటే కచ్చితంగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిందే.

ఆర్టీఏ ఆఫీసుల్లో ఆయా నంబర్లను డిస్​ప్లే చేస్తారు. వెబ్​సైట్​లోనూ పెడతారు. నంబర్​ డిమాండ్​ను బట్టి ధర నిర్ణయిస్తారు. నచ్చిన నంబర్​తో వినియోగదారులు డీడీ తీయాల్సి ఉంటుంది. ఒక్కరే డీడీ తీసి దరఖాస్తు చేసుకుంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఒకటి కంటే ఎక్కువ వస్తే వేలం వేస్తారు. ఎవరు ఎక్కువకు పాడుకుంటే వాళ్లకు ఆ నంబర్​ దక్కుతుంది. ఒకవేళ ఒకరిద్దరు ఉండి ఉంటే అక్కడి ఏజెంట్లు వేలం దాకా వెళ్లకుండా సెటిల్మెంట్లు చేస్తున్నారు.

ఇటు, చాలా మంది ఫ్యాన్సీ నంబర్లపై ఇష్టం పెంచుకోవడంతో ఆర్టీఏకి భారీగానే ఆదాయం అందుతోంది. వాటిపై నాలుగున్నరేళ్లలో వచ్చిన ఆదాయం కన్నా 2018–19లో వచ్చిన ఆదాయమే ఎక్కువ. 2014 జూన్​ 2 నుంచి ఇప్పటిదాకా రూ. 190.95 కోట్ల ఆదాయం వస్తే, ఒక్క 2018–19 ఆర్థిక సంవత్సరంలో వచ్చిందే రూ. 55.56 కోట్లని అధికారులు చెబుతున్నారు. 2017–18లో రూ. 45.46 కోట్లు, 2016–17లో రూ. 39.25 కోట్లు, 2015–16లో రూ. 31.11 కోట్లు, 2014–15లో అతి తక్కువగా రూ. 22.63 కోట్ల ఆదాయం వచ్చింది.