న్యూఢిల్లీ: ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని కేంద్ర రెవెన్యూ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు. బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించవచ్చునన్నారు. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థలు ఈ మార్పును అనుమతించాల్సిందేనని అజయ్ భూషణ్ పాండే తెలిపారు. నల్లధనం కట్టడిలో భాగంగా రూ.50 వేలు దాటిన విదేశీ ప్రయాణ బిల్లులు, హోటల్ ఖర్చుల వంటి వ్యయాలకు పాన్‌ను మోదీ సర్కార్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తి కొనుగోలుకూ పాన్ ఉండాల్సిందే. ఈ క్రమంలోనే బ్యాంక్ ఖాతాల నుంచి రూ.50 వేలకు మించి నగదు ఉపసంహరణ చేసి పాన్ స్థానంలో ఆధార్ వివరాలను ఇవ్వొచ్చా? అన్న ప్రశ్నకు పాండే పైవిధంగా సమాధానమిచ్చారు. రూ.50 వేలు దాటినా ఆధార్‌తో లావాదేవీలను పూర్తి చేయవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 41 కోట్లకుపైగా పాన్లు వాడుకలో ఉన్నాయని, వీటిలో 22 కోట్లు ఆధార్‌తో అనుసంధానమై ఉన్నాయని అజయ్ భూషణ్ పాండే చెప్పారు.
‘‘120 కోట్ల మందికి ఆధార్ ఉంది. పాన్ కావాల్సినవారు ఆధార్‌ను ఉపయోగించుకుని పాన్‌ను తెప్పించుకుంటున్నారు. కానీ ఇపుడు ఆ అవసరం లేదు’’ అని ఆయన చెప్పారు. రూ.50వేలకు మించి బ్యాంకులో జమ లేదా ఉపసంహరణ చేసిన పక్షంలో ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘‘అవును, అటువంటి సమయాల్లోనూ ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చు’’ అని అజయ్ భూషణ్ పాండే అన్నారు. ‘‘కొంత మంది పాన్‌ను ఉపయోగించుకోవడాన్ని సౌకర్యవంతంగా భావిస్తారు కాబట్టి ఆధార్, పాన్ రెండూ ఉంటాయి. కొంత మంది ఆధార్‌ను, కొంత మంది పాన్‌ను ఇష్టపడవచ్చు. అయితే ప్రతీ పాన్‌కు ఆధార్ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
బ్యాంకులు, ఇతర సంస్థలు ఆ ప్రకారం, పాన్ తప్పనిసరి ఉన్న లావాదేవీలకు ఆధార్‌ను అనుమతించడానికి తగిన ఏర్పాటు చేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 1.3 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులుకొత్తగా ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)లు ఫైల్ చేసే వారి సంఖ్య పెంచాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.30 కోట్ల మందిని కొత్త పన్ను చెల్లింపుదారులను జత చేయాలని లక్ష్యం నిర్దేశించింది. కొత్త పన్ను చెల్లింపులనూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9,22,465గా ఉంది. కాగా 2018-19లో దాదాపు 1.10 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులు జతయ్యారు.