తమ్ముళ్లను పరామర్శించనున్న చంద్రబాబు

34

అనంతపురం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రికి వచ్చేందుకు ఈనెల 9వ తేదీన విజయవాడ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు.

రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండటంతో కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తున్నారు. ఈనెల 9న విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డుమార్గాన తాడిపత్రి వెళ్లి హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

కాగా, అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో 2019 శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం మే 31వ తేదీన వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడి మరణించిన రాజప్ప కుటుంబ సభ్యులను జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్, ధర్మవరం నియోజకవర్గ తెదేపా నాయకులతో కలసి మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు.