సీఎంను కలుద్దామని చుక్కలు చూపించేశారు!

49

అమరావతి: సీఎంను కలుద్దామనుకుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని, వికలాంగుడనే కనికరం లేకుండా తనను ఈడ్చేశారని విశాఖపట్నానికి చెందిన దివ్యాంగుడు ఎం.సంతోష్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పెదవాల్తేరు జాలరిపేట బాలాజీనగర్‌ ప్రాంతానికి చెందిన దివ్యాంగ దంపతులు సంతోష్‌కుమార్‌, పూజ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డిని కలవడానికి 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలో జీవనం సాగించడానికి వైజాగ్‌ ఆర్కే బీచ్‌లో ఓ షాపును కేటాయించారని సంతోష్‌ తెలిపారు.

కాగా కొద్ది నెలల క్రితం తమ షాపును, రోడ్డుపై అక్రమంగా వున్నాయని జీవీఎంసీ అధికారులు తొలగించారని, ప్రస్తుతం బతుకుతెరువు లేక రోడ్డున పడ్డామన్నారు. తమకు తిరిగి షాపును కేటాయించాలని సీఎంకు చెప్పుకుందామని వస్తే అర్జీ తీసుకొని వెళ్లి పోవాలంటున్నారని, కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలిసేదాకా ఇక్కడే ఉంటామని, ఆత్మహత్యకు వెనుకాడబోమని కూడా వారు పేర్కొన్నారు. మరోవైపు, కర్మభూమి (బరియల్‌ గ్రౌండ్‌) అభివృద్ధి కాంట్రాక్ట్‌ వర్క్‌ దక్కించుకున్న తనకి కాంట్రాక్ట్‌ ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారని చిత్తూరు జిల్లాకు చెందిన కర్మభూముల సంరక్షణ సమితి కార్యకర్త వికలాంగుడు ఎం.మణి ఆరోపించారు.

ఇప్పటికే అప్పులపాలై కుటుంబం రోడ్డున పడిందని, ఇక తనకు చావే శరణ్యం అని మణి రోధిస్తూ తెలిపారు. సీఎం జగన్‌ను కలవడానికి 12 రోజుల క్రితం ఇక్కడకు వచ్చానని, పోలీసులు ఇంతవరకు కలవనివ్వడంలేదని ఆరోపించారు.