ప్రభాస్‌తో పోటీపడనున్న నాగార్జున

49
Nagarjuna Akkineni

హైదరాబాద్: సాధారణంగా టాప్ హీరోల సినిమాలు ఒక్క సంక్రాంతి సీజన్ మినహా మిగతా సీజన్స్‌లో ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల కావు. అయితే, ఈ ట్రెండ్‌కు భిన్నంగా నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ రిలీజ్ డేట్‌ను ఆగస్టు 9న అని ప్రకటించగానే ఇది అంతా ఒక పబ్లిసిటీ డ్రామా అని ఆగస్టు 15న విడుదల కాబోతున్న ‘సాహో’ ముందు తన సొంత సినిమాను విడుదల చేసేంత అనాలోచిత నిర్ణయం నాగ్ తీసుకోడు అని భావించారు అంతా.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున తన మూవీ రిలీజ్ డేట్‌ను మార్చుకోవడం లేదనీ స్పష్టమైన సంకేతాలు తన డిస్ట్రిబ్యూటర్స్‌కు ఇవ్వడమే కాకుండా అప్పుడే ఈమూవీకి అవసరమైన ధియేటర్లను ముందుగానే బుక్ చేయిస్తున్నట్లు టాక్. దీనితో నాగ్ ప్రభాస్‌తో పోటీకి ఏ మాత్రం దడవకుండా ముందడుగు వేస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ విషయమై నాగార్జున సన్నిహితులు కొందరు ఈ ప్రస్తావన నాగ్ దగ్గర తీసుకు వచ్చినప్పుడు అతడు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు టాక్. ‘సాహో’ మూవీ జోనర్‌కు తన మూవీ జోనర్‌కు చాల తేడా ఉందని అదేవిధంగా ‘సాహో’ 250 కోట్ల సినిమా అయితే తన సినిమా 50 కోట్ల సినిమా మాత్రమే అంటూ ఈ రెండు సినిమాల మధ్య పోటీ అని ఎందుకు అనుకోవాలి అని కామెంట్స్ చేసినట్లు టాక్.

అంతేకాదు తాను ఆగస్టు 9 విడుదల డేట్ వదులుకుని దసరా సీజన్‌కు వెళ్ళిపోతే అక్కడ కూడ తనకు ‘సైరా’ పోటీ వస్తుందని అందువల్ల తాను తన మూవీ రిలీజ్ డేట్‌ను మార్చుకునే ఆలోచన తనకు లేదు అంటూ సున్నితంగా చెప్పినట్లు సమాచారం. దీనితో నాగార్జున ఆత్మస్థైర్యం వెనుక కారణం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడటమే కాకుండా ఒక టాప్ యంగ్ హీరోకి మరొక టాప్ సీనియర్ హీరోకి జరిగే వార్‌కు వచ్చే నెల వేదిక కాబోతోందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.