స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధం

85

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన పార్టీ పని మొదలుపెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులైన పి.రామ్మోహన్‌రావు అధ్యక్షతన కమిటీ సభ్యులంతా ఆదివారం తొలిసారి సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న జనసేన పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ప్రణాళికల రచనను మొదలుపెట్టింది. లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీని రంగంలోకి దించింది.

తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ పి.రామ్మోహన్‌రావు చైర్మన్‌గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని రామ్మోహన్‌రావును చైర్మన్‌గా నియమిస్తూ గత నెల 24న పవన్ ప్రకటనను విడుదల చేశారు. అయితే, ఆదివారం ఈ కమిటీ సభ్యులంతా తొలిసారి సమావేశమయ్యారు. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా స్టానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించవచ్చని లోకల్‌ బాడీ ఎలక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది.

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ సాగింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగే అంశానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి కార్పోరేషన్‌ ఎన్నికల వరకు అభ్యర్థులను సిద్ధం చేసే అంశానికి సంబంధించి సుదీర్ఘ చర్చ సాగింది.

సభ్యులంతా తమ తమ అభిప్రాయాలను కమిటీ చైర్మన్‌కు వివరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం వార్డు స్థాయి నుంచీ చేపట్టాలని కమిటీ అభిప్రాయపడింది. నిర్మాణం అనంతరం కమిటీలకు కార్యాచరణ ప్రణాళికను వివరించి, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ సూచనలు చేసింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించారు.