జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ‘నారా’ వినతి

33

అమరావతి: జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతికత శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) ప్రతినిధి బృందం కలిసింది. జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని, వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ బండి సురేంద్రబాబు నాయకత్వంలో బాలినేనికి అందజేశారు. ఈ సందర్భంగా ‘నారా’ జాతీయ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిదన్నారు.

అలాంటి పాత్రికేయ వృత్తిని ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను, కుటుంబాలను సైతం పణంగా పెట్టి సమజాశ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారని, జర్నలిస్టులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అలాంటి వారి శ్రేయస్సు కోసమే నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నిరంతరం పోరాడుతోందన్నారు. ఈ పోరాటంలో భాగంగా అందరి సహకారాన్ని తీసుకొని ఐకమత్యంగా జర్నలిస్టుల హక్కులను కాపాడుకుంటామని సురేంద్రబాబు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలియచేసారు. మంత్రి బాలినేనిని కలసిన వారిలో ‘నారా’ జాతీయ అధ్యక్షుడు బండి సురేంద్రబాబుతో పాటు అసోసియేషన్ నేతలు ఎ.వి.వి శ్రీనివాసరావు, ఎస్. నాగరాజు, అక్షర శ్రీనివాస్, బండి సైదేష్, శివ, హరి, గుంటూరు, కృష్ణా జిల్లాల రిపోర్టర్లు పాల్గొన్నారు.