తివారి ఆనకట్టకు గండి: 23 మంది గల్లంతు

44

ముంబయి: ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని వర్షాలు ఇంకా ముంచెత్తుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు మరో వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. తాజాగా రత్నగిరిలోని తివారి ఆనకట్టకు గండి పడింది. ఆనకట్ట దిగువన ఉన్న 7 గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇద్దరు మృతి చెందారు. మరో 23 మందికి గల్లంతయ్యారు.

సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. వరద ఉద్ధృతికి 12 ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 2005 తర్వాత తొలిసారి 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో 24 గంటల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల ధాటికి ఇప్పటికే రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది. పలు విమాన సేవలను సైతం రద్దు చేశారు.