తుగ్లక్ పాలనను గుర్తు చేస్తున్న కేసీఆర్

91
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శ

హైదరాబాద్: సక్రమంగా, నాణ్యతగా ఉన్న అసెంబ్లీ, సచివాలయం భవనాలు కూల్చి కొత్త భవనాలను కట్టాలని నియంత నిర్ణయాలు తీసుకొని నేటితరం తుగ్లుక్‌గా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహరించి శంకుస్థాపనలు చేసి మళ్ళి ప్రజాధనం వృధా చేయడానికి సిద్ధపడడం దురదృష్టకరమని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

హైదరాబాద్ మఖ్డూమ్ భవన్‌లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యదిరెడ్డి అధ్యక్షతన సిపిఐ రంగారెడ్డి జిల్లా సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చాడ వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ ఇచ్చిన హామీలన్నీ మోసపూరిత వాగ్దానాలుగా మిగిలాయని నీళ్లు, నిధులు, నియామకాలు, డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కేజీటూ పీజీ ఇలా ఎన్నో రకాల ప్రజలకిచ్చిన వాగ్ధానాలు అమలు చేయక ఘోరంగా కెసిఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చి రంగారెడ్డి జిల్లా ప్రజలకు తెరాస ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ప్రభుత్వ ఉదాసీనత కాంట్రాక్టర్ల నిర్లక్యం వల్ల పనులు నత్తనడకగా నడుస్తూ ఏళ్ళు గడుస్తున్నా జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందడంలేదని చాడ వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాప్రభుత్వం అంటూనే జిల్లాలో పేద రైతుల భూములని లాక్కొని కొందరికి నామమాత్రం పరిహారం ఇచ్చ్చి కొందరికి ఇవ్వకుండానే సెజ్, ఫార్మాసిటీ ఇతర కంపెనీలకు ప్రభుత్వమే దళారీలలాగా వ్యవరించి కోట్లకు అమ్ముకుంటున్నారని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రజా సమస్యలు పరిష్కరంలో ఫుర్తిగా కెసిఆర్ ప్రభుత్వ విఫలం, అవినీతి పాలనా, నియంత పోకడలాంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసి చైతన్యపరచవలసిన అవసరముందని, ప్రజా సమస్యల పరిష్కరానికి, కెసిఆర్ దుర్మార్గమైన పాలనకు వ్యతరేకంగా జిల్లా నాయకత్వం పటిష్టమైన ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించాలని చాడ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యెన్. బాల మల్లేష్, జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్ రావు, సహాయ కార్యదర్శులు పాల్మాకుల జంగయ్య, ఏ. రవీంద్ర చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యిద్ అఫ్సర్, గ్యార యాదమ్మ, ఓరుగంటి యాదయ్య, పానుగంటి పర్వతాలు, శ్రీశైలం గౌడ్, రియాజ్, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు.