మహిళా అధికారిణిపై దాడి ‘ఆటవికం’

87
  • తప్పుబట్టిన బీజేపీ నేత బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: మహిళా అటవీ శాఖ రేంజ్ అధికారిని అనితపై జరిగిన దాడిని మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ తీవ్రంగా ఖండించారు. కింది స్థాయి నుండి పైస్థాయి వరకు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ప్రవర్తన తమని ఎదురించేవారు ఎవ్వరూ లేరనే అహంకారం వంటబట్టిందని విమర్శించారు. పోలీస్ అధికారుల సమక్షంలోనే విచక్షణా రహితంగా ఈ దాడి జరగడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నా నిరంకుశ పరిపాలనకు ఈ సంఘటన ఒక ప్రత్యక్ష నిదర్శనం మాత్రమేనన్నారు. ఈ సంఘటనలో ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల మీద కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా కఠిన మైన చర్యలు తీసుకొనవాలని, దాడికి పాల్పడ్డ వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పర్యావరణ రక్ష అనేది నేడు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో అటవీ అధికారుల పైన అందులోను మహిళా అధికారినిపై దాడి జరగడం శోచనీయమన్నారు. పర్యావరణాన్ని రక్షిస్తున్న అటవీ శాఖ అధికారులనే రక్షించలేని ప్రభుత్వం పర్యావరణాన్ని ఏ విధంగా రక్షిస్తుందని దత్తాత్రేయ ప్రశ్నించారు.

అటవీ సంరక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని, వణ్యమృగాలని రక్షిస్తామని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై కోట్ల మొక్కలు ఒకే రోజున నాటామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి, తన పాలనలో అవినీతితో పోరాడే అధికారులకు రక్షణ కరువయ్యిందని ఆవీదన వ్యక్తం చేసారు. ఇప్పుడు ఆ నూతన అటవీ చట్టం ఏమయ్యింది? ఒక్క నెలరోజుల వ్యవధిలో అటవీ శాఖ అధికారులపై నాలుగు సార్లు దాడులు జరిగినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.