అమెరికాలో కూలిన విమానం: 10 మంది మృతి

31

హోస్టన్‌ (అమెరికా): అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌లో ఓ చిన్న ప్రైవేటు విమానం కూలి పది మంది మృత్యువాతపడ్డారు. స్థానిక యాడిసన్‌ మున్సిపల్‌ విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనతో విషాదం చోటు చేసుకుంది. రెండు ఇంజిన్లు కలిగి ఉన్న బీచ్‌క్రాఫ్ట్‌ కింగ్‌ ఏయిర్‌ 350 రకానికి చెందిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది క్షణాల వ్యవధిలోనే విమానాశ్రయ హ్యంగర్‌ (విమానాలను నిలిపి ఉంచే షెడ్డు)ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

వెంటనే మంటలు చెలరేగడంతో విమానంలో ఉన్న పది మంది అందులోనే సజీవ దహనమయ్యారు. దట్టమైన పొగలు అలుముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను అదుపు చేశారు. విమానం టేకాఫ్‌ సమయంలో హ్యాంగర్‌ను ఎందుకు ఢీకొందన్న కోణంలో పోలీసులు, విమానాశ్రయ వర్గాలూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో హ్యంగర్‌లో ఎవరూ లేనట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేర్కొంది. మరోవైపు, ఫెడరల్ ఏవియేషన్స్ ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ ప్రారంభించింది. సిగ్నలింగ్ లోపం ఏదైనా ఉందా? లేక పైలెట్ తప్పిదమా? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు నిపుణులు.