దేవుడ్ని చూసిన ఆనందమూ మిగల్లేదు!

28
  • చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో తిరుమలేశుని భక్తుల మృతి

  • లారీని కారు ఢీకొట్టడంతో ఐదుగురి మృత్యువాత: ఆరుగురికి గాయాలు

చిలకలూరిపేట (గుంటూరు): దేవుడిని దర్శించుకున్నామన్న ఆనందం ఆ కుటుంబంలో ఎంతోసేపు మిగల్లేదు. తిరుమలేశుని సేవలో తరించి సంతోషంగా తిరిగి వస్తున్న ఆ కుటుంబంలో అయిదుగురిని రోడ్డు ప్రమాదం కబలించింది. గుంటూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు.

తిరుమల శ్రీవారిని దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అతి వేగం, కునుకుపాటు కారణంగా జరిగి ఉంటుందని భావిస్తున్న ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బువారిపాలేనికి చెందిన వెంకటేశ్వరరావు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. ఆదివారం స్వామి దర్శనం అనంతరం సొంతూరుకి బయలుదేరారు.

వారు ప్రయాణిస్తున్న వాహనం చిలకలూరిపేటలోని ఎన్.ఆర్.టి కూడలి వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మరణించడం స్థానికులను కలచివేసింది. వెంకటేశ్వరరావు ఆయన భార్య సూర్య భవాని, కుమార్తె సోనాక్షి, కుమారుడు గీతేశ్వర్, సోదరుడు ఆనంద్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన సాయికిరణ్, సాయిదుర్గ తులసి, దివ్య శైలజ, అనంత లక్ష్మి, తేజేశ్వర్‌తో పాటు డ్రైవర్ మణికంఠను ముందుగా చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే అక్కడ సీనియర్ వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి సిబ్బంది కేవలం ప్రధమ చికిత్సతో సరిపెట్టారు. క్షతగాత్రులను సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చినా ఉదయం 7.30 వరకూ సరైన వైద్యం అందలేదు. దీంతో అక్కడే ఉంటే సరైన వైద్యం అందదని భావించిన బాధితుల కుటుంబ సభ్యులు వారిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది.

ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ ప్రమాదంలో సాయిదుర్గ తులసి తీవ్రంగా గాయపడినా ప్రస్తుతానికి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో అత్యవసర వైద్యులు కూడా అందుబాటులో లేరన్న విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు పరిస్థితులను ఆరా తీసి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.