అమర్‌నాథ్‌ యాత్ర ఆరంభం

36

అనంతనాగ్ (శ్రీనగర్): అమర్‌నాథ్ యాత్ర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్లోని దక్షిణ పర్వత ప్రాంతంలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ గుహను దర్శించుకునేందుకు తొలియాత్రను అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో అనంత్‌నాగ్‌ జిల్లా అభివృద్ధి విభాగం కమిషనర్‌ ఖలీద్ జహంగీర్‌ జెండా ఊపి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆదివారం జమ్ము బేస్ క్యాంపు నుంచి బల్తాల్‌ బేస్‌ క్యాంప్‌నకు బయలుదేరిన యాత్రికుల బృందం సోమవారం యాత్రను ప్రారంభించారు. తొలి బృందంలో 2,234 మంది భక్తులు ఉన్నారు.

46 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈసారి 1.5 లక్షల మందికి పైగా భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈసారి యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేపట్టవచ్చని నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. యాత్రకు దాదాపు 30 వేల మందికి పైగా పోలీసులు, సైనిక సిబ్బందితో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. నిత్యం సీఆర్పీఎఫ్‌ సిబ్బంది తమ హెల్మెట్లకు అమర్చిన సీసీ కెమెరాలతో దారి పొడవునా పహారా కాస్తున్నారు. 2017లో యాత్రికులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, అమర్‌నాథ్ గుహ విశేషాల్లోకి వెళ్తే, ఇదో హిందువుల మహా పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్‌లోని జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం పరిధిలో ఉంది.

3,888 మీటర్ల ఎత్తులో జమ్మూకశ్మీర్ రాజధానికి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. హిందువులకు ఈ పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు చాలా మంది భక్తులు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే ఉంటాయి అమర్నాథ్ కొండలు. ఆ కాలంలోనే వేలల్లో భక్తులు కొండలు ఎక్కి అమర్నాథ్ గుహను చేరుకుంటారు. ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు. ఈ మంచు శివలింగాన్ని చూసేందుకు ఎన్నో సవాళ్ళతో కూడిన ప్రయాణం చేస్తారు భక్తులు. 40 మీటర్ల ఎత్తుండే అమర్నాథ్ గుహ లోపల నీటి చుక్కలతో నిలువుగా లింగాకారంలో మంచు గడ్డ కడుతుంది. పంచ భూతాల రూపాల్లో శివుడు ఉంటాడనే హిందువుల నమ్మకం.

అందుకే ఇక్కడ శివుడు జలరూపంలో ఉన్నాడని భక్తులు అంత శ్రమకోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. మే నుంచి ఆగస్టు వరకు హిమాలయాలలో మంచు కరగడం వల్ల ఈ పుణ్యక్షేత్రం మంచు నుంచి బయటకు వచ్చి, సందర్శనకు వీలుగా ఉంటుంది. ఈ లింగం వేసవిలో చంద్రుని కళల ప్రకారం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుందని విశ్వసిస్తారు హిందువులు. హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవికి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఇక్కడ ఉండే మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి, వినాయకునిగా భక్తులు కొలుస్తారు. ఈ గుహలో ఏర్పడే మంచు లింగాన్ని దర్శించేందుకే ప్రతీ సంవత్సరం అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు భక్తులు.

300 బీసీకి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమర్‌నాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు. ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. మధ్యయుగంలో ఈ క్షేత్రం గురించి మర్చిపోయినట్టూ, తిరిగి ఒక గొర్రెల కాపరి 15వ శతాబ్దం లో తిరిగి కనుక్కున్నట్టు ఒక నమ్మకం.