కశ్మీరు లోయలో పడిన బస్సు: 33 మంది మృతి

6

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి ఏకంగా 33 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. కేశ్వాన్‌ నుంచి కిష్టావర్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు సీనియర్‌ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.

మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో 50 మందికి పైనే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతివేగంతో పాటు సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించడం వల్లే బస్సు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం వరకు 20 మృతదేహాలను వెలికితీశామని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.

ఘటనపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.