పరోక్ష పన్ను వసూళ్ళలో ఊహించని ప్రగతి

400

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ పరోక్ష పన్ను వసూళ్లలో 4.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. గత ఏడాది రూ. 1.05 లక్షల కోట్ల పరోక్ష పన్నులు వసూలు కాగా ఈ ఏడాది రూ.1.11 లక్షల కోట్లు వసూలయ్యాయి. అయితే పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ పడిపోవడంతో ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు 4.9 శాతం తగ్గిపోయాయి. ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన తొలి త్రైమాసికంలో రెండు నెలల పాటు పారిశ్రామిక ఉత్పత్తుల్లో క్షీణత నమోదైనందున ఎక్సైజ్‌ సుంకం రూ.37,600 కోట్లు మాత్రమే వసూలైంది. ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు ఏప్రిల్‌లో 14.7 శాతం, మేలో 2.7 శాతం తగ్గితే, జూన్‌లో స్వల్పంగా 0.9 శాతం పెరిగాయి. కస్టమ్స్‌ సుంకం వసూళ్లు 6.9 శాతం వృద్ధి చెంది రూ. 40,800 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో రూ.5.65 లక్షల కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది రూ. 4.73 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం.

సేవా పన్ను వసూళ్లు 15.2 శాతం పురోగతితో రూ.32,500 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌లో పన్ను వసూళ్ళ వృద్ధి లక్ష్యం 36 శాతం పెట్టుకోగా, 26 శాతం సాధించారు. ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వృద్ధిరేటు తగ్గినప్పటికీ ఈ రీజియన్‌లో పన్ను వసూళ్ళ వృద్ధి ఆశాజనకంగా ఉన్నదని అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ శాఖల్లో పన్ను వసూళ్ళ వృద్ధి సగటున 20 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ళ వృద్ధి 20 శాతంగా లక్ష్యాన్ని నిర్దేశించారని, దీన్ని సాధించడం పెద్ద సమస్య కాదన్నారు. తమ రీజియన్‌లో ఈ శాఖ అధికారులు, పన్ను చెల్లింపుదారుల సహకారంతోనే 26 శాతం వృద్ధి సాధించామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి సంతృప్తి వ్యక్తంచేశారు.

ఉత్పాదక రంగానికి పన్ను వసూళ్ళతో ప్రత్యక్ష సంబంధం లేదని, ఇది వివిధ రంగాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఆశించిన రీతిలో లేకపోవడంతోపాటు దాని ప్రభావం అనేక దేశాలపై పడిందని ఆయన అన్నారు. భారతీయ ఉత్పాదనరంగం వృద్ధి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా పన్ను వసూళ్ళలో తాము లక్ష్యాలను చేరుకోవడంలో విజయవంతం అయ్యామని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి శుంకంలో అనేక రాయితీలు వచ్చాయని, అయితే ఇతర పన్ను వసూళ్ళలో పెద్దగా మార్పులు లేవని ఆయన చెప్పారు. బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వచ్చిందని, ఆర్థిక నిపుణులు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు తమకు అనుకూలమైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని రంగాల్లో పన్ను విధింపులో ఏమాత్రం మార్పులేదని, మరికొన్నింటిలో అటుఇటుగా మార్పులు జరిగాయన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంలో భాగంగా రాష్ట్రంలో ఉత్పాదన రంగం కుదేలైందని ఫ్యాప్సీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్రంలో ఉత్పాదన రంగం వృద్ధి శూన్యంగా రికార్డయిందని ఆయన చెప్పారు. ఆర్థికాభివృద్ధి సాధించకుంటే ప్రభుత్వానికి రెవెన్యూ వృద్ధి కూడా ప్రతికూలమవుతుందని చెప్పారు. దేశంలో పది శాతానికి మించి ఆదాయ పన్ను చెల్లింపుదారులు లేరని, పారిశ్రామిక రంగం నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన అన్నారు.