అబ్బో! దీనికి బాగా స్పీడెక్కువ!!

303

ఔనండీ… ఇప్పుడు మనం ప్రస్తావించుకునే సాంకేతికతకు బాగా పరుగెక్కువట. శాస్త్ర, సాంకేతికంగా ప్రపంచం శరవేగంగా పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో మారుతున్న, కొత్తగా పుట్టుకువస్తున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అందివస్తున్న టెక్నాలజీ మనిషి జీవితంలో అనేక మార్పులకు కారణమవుతోంది. అయితే, ఈ వేగాన్ని మనం సరిగ్గా, అవసరమైన మేరకు వినియోగించుకుంటే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమన్నది ఇక్కడ ప్రస్తావనార్హం.

ప్రపంచం ఇప్పుడు 2జీ స్థాయి నుంచి ప్రస్తుతం 4జీ స్థాయి ఇంటర్నెట్ స్పీడ్‌కి వచ్చింది. ఫలితంగా మెబైల్ ఫోన్‌ల్లో కొన్ని నిమిషాల్లో ఓ సినిమాను, పాటలని స్పీడ్‌గా డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నాం. తాజాగా 4జీ స్థాయి నుంచి 5జీ వేళ్లేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. పేరుగుతన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నెట్ స్పీడ్‌ని అభివృద్ధి చేసుకుంటున్నాం. 5జీ వస్తే ఆ నిమిషాలు అయ్యే డౌన్ లోడ్ కాస్త సెకన్లలోకి తగ్గిపోతుంది. మరి 5జీ కంటే 10 రెట్లు అధిక వేగంతో డౌన్‌లోడ్ చేసుకోగలిగితే? నిజం.

అయితే, అది సాధ్యమా? అని అనుమానిస్తున్నా? మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. ఊహకే అందని అత్యద్భుత సాంకేతికతను జపాన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. జపాన్‌లోని హిరోషిమా యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలకు చెందిన శాస్త్రవేత్తలు టెరాహెర్జ్ ట్రాన్స్‌మీటర్‌ను అభివృద్ధి చేశారు. ఇది సెకనుకు 100గిగాబిట్స్ కంటే అధిక వేగంతో డిజిటల్ డేటాను బదిలీ చేయగలదట. అది కూడా వైర్‌లెస్ నెట్‌వర్క్ ద్వారానే.

తాజాగా నిర్వహించిన పరీక్షల్లో 105గిగాబిట్స్(13.125జీబీ)/సెకను వేగంతో డేటా బదిలీ అయినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఆ లెక్కన చూస్తే ఒక సినిమా 1జీబీ ఉందనుకున్నా సెకనులో 13 సినిమాలు డౌన్‌లోడ్ అయిపోతాయన్నమాట! ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వైర్‌లెస్ కమ్యూనికేషన్ సాంకేతికత ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

విమానాల నెట్‌వర్క్ లకు సర్వర్ల నుంచి భారీ మొత్తంలో డేటాను బదిలీ చేయడానికి, మొబైల్ నెట్‌వర్క్‌ వేగాన్ని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. 2020లోగా 5జీ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ అల్ట్రా స్పీడ్ సాంకేతికత ఎప్పుడొస్తుందో చూడాలి.