టూవీలర్ కొనుగోలుదారులకు హీరో సరికొత్త ఆఫర్‌

192

ముంబయి: విద్యుత్ వాహనాల విక్రయాలను పెంచుకునే ప్రయత్నాలలో భాగంగా దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరోమోటో కార్ప్‌ వినూత్న ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న పాత పెట్రోల్ వాహనాలను వెనక్కిఇస్తే ఏకంగా 6 వేల రూపాయలు క్యాష్‌బ్యాక్ చెల్లించాలని నిర్ణయించింది. ఒకవిధంగా, ఇది బైబ్యాక్ తరహా ఆఫరేనని పోటీదారులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘మీ పాత పెట్రోల్‌ ద్విచక్ర వాహనాన్ని ఇచ్చి ఎలక్ట్రిక్‌ బైక్‌ను కొనుగోలు చేస్తే రూ.6,000 లబ్ధి కల్పిస్తాం’ అని హీరోమోటో కార్ప్‌ తాజాగా ప్రకటించింది.

అయితే, పాత వాహనాన్ని ఇచ్చి విద్యుత్‌తో నడిచే కొత్త వాహనాన్ని తీసుకునే వినియోగదారులకు పాత పెట్రోల్‌ వాహనానికి మార్కెట్‌ విలువ కంటే రూ.6,000 అదనంగా చెల్లిస్తామని పేర్కొంది. ఆ వాహనం విక్రయానికి పనికిరానిదై, జీవితకాల చరమాంకంలో ఉన్నా ఈ ఆఫర్‌ వర్తింపజేస్తామని తెలిపింది. బీఎస్‌4 వాహనంతో పోలిస్తే ఇవి దాదాపు రెండింతల కాలుష్యాన్ని సృష్టిస్తాయని పేర్కొంది. దేశంలో కాలుష్య కారకమైన 5 కోట్ల వాహనాలు ఉన్నాయని కంపెనీ అంచనా వేసింది. హీరో ఎలక్ట్రిక్‌ వాహనం పెట్రోల్‌ వాహనంతో పోలిస్తే ఖర్చులను చాలా తగ్గిస్తుందని ఆ సంస్థ చెబుతోంది.

ఈ వాహనాల బ్యాటరీపై 3 ఏళ్ల వారెంటీని హీరో ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగదారుడికి మిగులు రూపంలో మారిస్తే రూ.70వేలకు సమానమని పేర్కొంది. విద్యుత్తు వాహనాల అభివృద్ధి విభాగం సీఈవో సోహిందర్‌ సింగ్‌ గిల్‌ మాట్లాడుతూ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. హీరో దీనికి మద్దతు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తోందన్నారు. హీరోమోటో కార్ప్‌ తాజా ఆఫర్‌పై పోటీదారులు ఎలా స్పందిస్తారో? ఇంకెన్ని ఆఫర్లను తీసుకువస్తారో వేచిచూడాలి.