గ్రామ వాలంటీర్ల‌కు అనూహ్య స్పంద‌న‌

113

అమరావతి: గ్రామ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆరు రోజుల్లోనే 6 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు, గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌కు వీక్షకులు పోటెత్తారు. సుమారు పదకొండు లక్షలమందికి పైగా గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌ను వీక్షించారు. కాగా దరఖాస్తులు అధికంగా వస్తుండటంతో అధికారులు ముందుగానే పరిశీల ప్రారంభించారు.

ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పదో తేదీ నుంచి మండల స్థాయి కమిటీలు పరిశీలన చేసి 11 నుంచి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. అయితే, దరఖాస్తులు ఎక్కువగా అందుతుండటంతో పదో తేదీ ఒక్కరోజు మొత్తం దరఖాస్తులను మండల కమిటీ పరిశీలన చేయడం సాధ్యం కాదని, దరఖాస్తు అందిన వెంటనే పరిశీలన చేసి నమోదు చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి దాదాపు 6 లక్షల దరఖాస్తులు అందాయని అధికారిక సమాచారం.