అక్షరాభ్యాసానికి వెళ్తూ తిరిగిరాని లోకానికి…

67
  • కామారెడ్డి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

  • అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

  • డీజిల్ ట్యాంకర్ పేలి లారీ దగ్ధం… హైవేపై స్తంభించిన ట్రాఫిక్

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

సదాశివనగర్‌ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి క్రాసింగ్‌ వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఇదే ప్రమాదంలో లారీ కూడా దగ్దమైంది.

హైదరాబాద్‌ నగర శివారు వనస్థలిపురం హైకోర్టు కాలనీకి చెందిన రాకేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బాసర ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాకేశ్‌ బావమరిది, భార్య, అత్త ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రాకేశ్‌కు కుడి భుజం విరిగింది.

రాకేశ్‌ కుమారుడు అభిరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. కాగా కారు బలంగా ఢీకొనడంతో డీజిల్‌ ట్యాంకు పగిలి లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేశారు. ఘటనా స్థలం వద్ద స్తంభించిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. జాతీయ రహదారిపై వస్తున్న ఒకవైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. రహదారిపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం అక్కడి వారిని కలచివేసింది.

అతివేగంగా వెళ్తూ కారు బలంగా ఢీకొనడంతో డీజిల్ ట్యాంకర్ పేలి లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమయింది. శకలాలను తొలగించేందుకు పోలీసులు నానావెతలు పడ్డారు. గాయపడ్డవారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.