‘బాక్సర్‌’లో సంజనా

39

చెన్నై: తెలుగులో ‘సర్ణఖడ్గం’ ధారావాహికతో గుర్తింపు తెచ్చుకున్న నటి సంజనా గల్రాణి. ‘బుజ్జిగాడు’ వంటి పలు చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఈ అమ్మడు కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. ఈమె చెల్లెలు నిక్కీ గల్రాణి తమిళనాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సంజనా గల్రాణి కూడా కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. అరుణ్‌ విజయ్‌, రితికాసింగ్‌ కలిసి నటిస్తున్న ‘బాక్సర్‌’ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది సంజనా.

ఇందులో అరుణ్‌ విజయ్‌ బాక్సర్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ గతంలో పలు అవకాశాలు వచ్చాయని, అయితే మంచి సినిమా కోసం ఎదురు చూశానని, ఇప్పుడు ‘బాక్సర్‌’ సినిమా ద్వారా అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని, తప్పకుండా గుర్తింపు తెచ్చుకుంటానన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.