రైతులకు లాభం చేకూర్చుతున్న కేసీఆర్: సింగిరెడ్డి

43

హైదరాబాద్: నాణ్యమయిన విత్తనాలతో రైతుకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో గత ఐదేళ్లలో క్రమక్రమంగా ఎదుగుతూ దేశంలో 60 శాతం విత్తన మార్కెట్‌ను ఆక్రమించిన తెలంగాణ రాష్ట్రం 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు బుధవారం నుండి జులై 3 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తుండడం ద్వారా ప్రపంచ విత్తన మార్కెట్‌లో తన ఘనతను చాటుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

బుధవారం విత్తన సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల కోసారి జరిగే అంతర్జాతీయ విత్తన సదస్సు ఈ సారి ఇక్కడ జరుగుతున్నందున తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని, ప్రపంచ మార్కెట్లోకి తెలంగాణ విత్తనాలు సులువుగా వెళ్లడానికి ఈ సదస్సు దోహదపడుతుందని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆసియా దేశాలలో ఈ సదస్సు జరగడం తొలిసారిని, అదీ తెలంగాణలో జరుగుతుండడం విశేషమని మంత్రి తెలిపారు.

ప్రపంచ మార్కెట్లోకి విత్తనాలు ఎగుమతి చేయాలన్నా, అక్కడ అమ్ముకోవాలన్నా ఇస్టా అనుమతి తప్పనిసరి అయిన నేపథ్యంలో ఇక్కడ సదస్సు నిర్వహణ మూలంగా విత్తనాల దిగుబడిలో పాటించాల్సిన మెలుకువలపై, మారుతున్న పర్యావరణ మార్పుల నేపథ్యంలో మేలైన విత్తనాల దిగుబడికి సాగులో అనుసరించాల్సిన పద్దతులు, అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాల్సిన తీరుపై రైతులకు తెలంగాణ రైతాంగానికి అవగాహన ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఇస్టా పరీక్షించిన ప్రయోగశాలల అనుమతి పొందిన తరువాతనే ఎగుమతులకు అవకాశాలు ఉన్నందున ఈ సదస్సు దేశంలో విత్తన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణకు మరింత ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్ర వేత్తలు, 80 దేశాల నుండి 400 మంది విత్తన రంగ నిపుణులు హాజరవుతున్నారని, తెలంగాణ విత్తన భాండాగారం కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని, ఈ సదస్సుతో తెలంగాణ విత్తన ప్రతిభ ప్రపంచ దేశాలకు తెలుస్తుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాలుపంచుకోవాలని రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య ప్రజాప్రతినిధులు ఆహ్వానాలు పంపడం జరిగిందని తెలిపారు.