లక్ష్యం ఎలా నెరవేరుతుందో?

89

2022-23 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యం సంగతి ఏమో గానీ, అన్నదాతను ఆదరించే పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కానరావడం లేదు. 2022-23 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఆశయంతో నీతి ఆయోగ్ ఇటీవల ఒక ఎజెండాను ఆవిష్కరించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అనే శీర్షికతో ఆ ఎజెండాలో ఒక అధ్యాయం ఉంది. లక్షం నెరవేరడానికి నీతిఆయోగ్ తన పథకంలో నాలుగు అంశాల కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది.

కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ, సరియైన చర్యలు సరియైన దిశగా తీసుకొంటే రైతుల ఆదాయం రెట్టింపు కావచ్చు ప్రతిపాదనలు ఆ విధంగా ఉన్నాయి. అయితే చాలామంది వ్యవసాయ నిపుణులు ఈ పథకం లక్షం నెరవేరుతుందని అంత ధీమాగా చెప్పడం లేదు. మన వ్యవసాయ రంగంలో చిన్న రైతుల సంఖ్యే అధికం. అందు చేత సాగునీటి సరఫరా, విత్తనాలు, ఎరువులలో పెట్టుబడి తగినంత ఉండేలా చూడాలని నీతిఆయోగ్ ప్రతిపాదించింది. ఫలసాయం అధికంగా ఉండే ఉద్యాన వనాలు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమకు రైతులు ప్రాధాన్యం ఇచ్చే విధంగా కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలను వారి అందుబాటులోకి తేవాలని కూడా నీతిఆయోగ్ ప్రతిపాదించింది. గత పదేళ్లలో ఎరువులపై సబ్సిడీ ఐదురెట్లు పెరిగింది.

సబ్సిడీల ద్వారా వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరుగుతున్నాయనడానికి గట్టి దాఖలాలు లేవు. వ్యవసాయరంగం ఆధునీకరణకు కొత్త సాంకేతిక విజ్ఞానాలను దిగుమతి చేసుకోవాలని నీతిఆయోగ్ సూచించింది. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో వ్యవసాయవృద్ధి స్తంభించింది. ప్రభుత్వాలు లక్షాన్ని నిర్దేశించడమే తప్ప అందుకు కావలసిన వనరులను సమకూర్చడంలో విఫలమవుతున్నందువల్ల ప్రభుత్వాలు నిర్దేశించిన స్థాయిలో వ్యవసాయ రంగం ఫలితాలను అందించడం లేదు. ఉదాహరణకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వృద్ధి 1991-92 నుంచి 2013-14 దాకా కేవలం 3.2 శాతం. ఇది 4 శాతం లక్షం కంటే చాలా పాయింట్లు తక్కువ.

ప్రస్తుతం నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన నాలుగు అంశాల కార్యాచరణలో రైతులకు గిట్టుబాటు ధర చేకూర్చడానికి ప్రస్తుత మార్కెటింగ్ వ్యవస్థను సంస్కరించడం, ఉత్పత్తి సామర్థాన్ని పెంచడం, వ్యవసాయ భూముల విధానాన్ని సంస్కరించడం, ఆపత్కాలంలో వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం వంటి నాలుగు ప్రధానాంశాలు ఉన్నాయి. అయితే ఈ చర్యల వల్ల రైతు ఆదాయం రెట్టింపు అవుతుందా? అన్నది ప్రశ్న. జనాభాలో సగం మందికి వ్యవసాయ రంగమే ఇప్పటికీ కూడు పెడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 24.39 కోట్ల కుటుంబాల్లో 17.91 కోట్ల కుటుంబాల వారు గ్రామాల్లో నివసిస్తున్నారు. వారు ఎంతో కొంత వ్యవసాయంపైనే ఆధారపడి మనగడ సాగిస్తున్నారు. 2015-16 ఆర్థిక సర్వే ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం వాటా 48.9 శాతం అని పేర్కొంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో కూడా వ్యవసాయం వాటా 2014-15లో 17.4 శాతం. ఇది 2011-12 ధరల ప్రకారం లెక్కకట్టినది.

ఈ ఏడాది వ్యవసాయ రంగంలో అదనంగా 4.1 శాతం వృద్ధి చోటు చేసుకోవచ్చుఅని కూడా నిపుణులు అంచనావేస్తున్నారు. నీతి ఆయోగ్ ఎజెండాలో ‘గిట్టుబాటు ధరలు’ అనే మొదటి సూత్రం కింద మార్కెటింగ్ సంస్కరణలు, కనీస మద్దతు ధరను సూచించారు. కానీ వ్యవసాయం రాష్ట్రాల అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది అంతగా ఉండదు అని గుర్తు పెట్టుకోవాలి. సంస్కరణల క్రమాన్ని ప్రోత్సహించడం తప్ప కేంద్రం చేయగలిగింది లేదు.వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయో నీతిఆయోగ్ వివరించింది.

వ్యవసాయ మార్కెటింగ్‌లో విధానపరమైన వక్రీకరణలు చోటుచేసు కొంటున్నాయి. పెద్ద సంఖ్యలో మధ్యవర్తుల ప్రమేయం, మౌలిక సౌకర్యాల కొరత వల్ల ఇది చోటు చేసుకొంటోంది. మధ్యవర్తుల గుప్పిట్లో ఇరుక్కోవడం వల్లే రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని ఈ అంశంపై అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు పంజాబ్‌లో వ్యవసాయ రుణాల మొత్తంలో 38 శాతం సంస్థాగత రుణాలు కావు. వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు అందిన రుణాలే అవి. ఒకోసారి 20 శాతం వడ్డీని కూడా వారు గుంజుతున్నారు. అంతేకాక రైతులు ఉత్పత్తిని తమకే అమ్మాలని దళారీలు బలవంత పెడుతున్నారు కూడా. ఫలసాయం ఎవరికి అమ్మాలన్న విషయంలో రైతుకు స్వేచ్ఛ లేదు.

దీనివల్ల దళారులకే వారు చెప్పిన రేటుకే అమ్ముతున్నారు. ఈ రకంగా ఎడాపెడా నష్టాల్లో పంజాబ్ రైతులు ఇరుక్కుపోతున్నారు. ఎపిఎంసి చర్యల్లో లోపాలను పరిష్క రించడానికి ‘2003 వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీల అభివృద్ధి, క్రమబద్ధీ కరణ నమూనా చట్టం’ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం పంచింది. వ్యవసాయ ఉత్పత్తుల అంతర్రాష్ట వాణిజ్యంలో అక్రమాలు చోటు చేసుకొన్నట్లు 2013-14 ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. ఇక కనీస మద్దతు ధర అంశానికి వస్తే ఇటీవల కాలంలో దీనిపై ఘాటుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రతిఏటా కనీస మద్దతు ధర పెరుగుతూ పోతున్నప్పటికీ కనీస మద్దతు ధర ప్రక్రియలో గిరాకీ అంశం పరిగణనలోకి రాకపోవడం ప్రధాన లోపం.

దీనివల్ల తృణ ధాన్యాల నిల్వలు పెచ్చుమీరుతున్నాయి. ఎందుకంటే వ్యవసాయానికి మూల వనరులైన భూమి, నీరు, పరిమితంగా ఉండడంతో వాటిని అత్యంత సమర్థంగా వాడవలసి ఉంది. అప్పుడే వ్యవసాయదార్ల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేయగలం.కనీస మద్దతు ధర అమలులోకి వచ్చాక పంట వేసే పద్ధతుల్లో వక్రీకరణలు జరిగాయని నీతి ఆయోగ్ వేలెత్తి చూపింది. కనీస మద్దతు ధర కాలంలో సాధారణంగా గోధుమ, బియ్యం, చెరకు ఉత్పత్తికే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పప్పు దినుసులు, చమురు గింజలు వంటి పంటలకు భూమి కొరత ఏరడింది.

ఫలానా పంట లక్షంగా పెట్టుకొన్నపుడు దాన్ని పండించే రైతులకు సబ్సిడీలను నీతిఆయోగ్ సరిగానే సూచించింది. ఇక 2010-11 వ్యవసాయ లెక్కల సేకరణ ప్రకారం దేశంలోని మొత్తం రైతులలో 67.10 శాతం మంది ఒక హెక్టార్‌కు మించని పేద రైతులు. ఒకటి రెండు హెక్టార్లు మించని చిన్న తరహా రైతులు 17.91 శాతం మంది. జన్యు మార్పిడి పంటలువంటి టెక్నాలజీలకు రైతులను సుముఖం చేయడం అంత సులభం కాదు. ఇలా ఏరకంగా చూసినా మార్పులకు రైతులు ఒప్పించనిదే అతని ఆదాయాన్ని రెట్టింపు చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం ద్వారా సమకూరే ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యం ఎలా నెరవేరుతుందో వేచిచూడాల్సిందే.