పాలకుల నిర్లక్ష్యం… ప్రయాణీకులకు శాపం

33

విశాఖపట్నం: ప్రజల కోసం ఎన్నో చేస్తున్నామని చెబుతున్న పాలకులు క్షేత్రస్థాయిలో అతి కీలకమైన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టిపెట్టడం లేదు. ఆ సమస్యల పరిష్కారం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కానప్పటికీ ప్రజలకు అవస్థలు నిత్యకృత్యమవుతున్నాయి. ఒక పక్క ఎండలు, మరోపక్క వర్షాలు ప్రయాణీకులకు మాత్రం అవస్థలు కలిగిస్తున్నాయి.

ఎందుకంటే బస్సు కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్‌ షెల్టర్లు లేవు. నిలువ నీడ లేక చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జంక్షన్‌లో బస్సుల కోసం నిరీక్షించే సమయంలో ఎండ మండినా, వాన వచ్చినా తలదాచుకోవడానికి పరుగులు తీయాల్సిన దుస్తితి. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ వారు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. చోడవరం నియోజకవర్గంలో సుమారు 80 గ్రామాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోగా మిగతా 100 గ్రామాలకు బస్సులు వెళుతున్నా 60 శాతానికి పైగా గ్రామాలకు బస్‌ షెల్టర్లు లేవు. నియోజకవర్గంలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన సుమారు 40 వేలకు మందికి పైగా ఉద్యోగులు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు, ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రోజువారీ పనులు, ఇతర కార్యక్రమాలకు రాకపోకలు సాగిస్తుంటారు.

వీరంతా ఎండలకు మండుతూ, వర్షాలకు తడుస్తూ ఎప్పుడో వచ్చే బస్సులు, ఆటోల కోసం గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి, మాడుగుల ప్రధాన ప్రాంతాలకు వెళ్లే బీఎన్‌ రోడ్డు, మాడుగుల రోడ్డు, అనకాపల్లి–బంగారుమెట్ట, తోటకూపాలెం, రావికమతం రోడ్లులో సైతం చాలా గ్రామాల వద్ద బస్‌ షెల్టరు లేవు. నాలుగైదు గ్రామాల్లో స్థానిక దాతల సాయంతో బస్‌షెల్టర్లు నిర్మించగా, మరో ఏడు చోట్ల గతంలో పార్లమెంటు సభ్యుల నిధులతో నిర్మించారు. మిగతా గ్రామాల్లో కనీసం నిలబడడానికి నీడ కూడా లేని దయనీయ పరిస్థితి నెలకొంది. చోడవరం మండలంలో గోవాడ, అంబేరుపురం, గజపతినగరం, గంధవరం, లక్కవరం, గాంధీగ్రామం, నర్సయ్యపేట, గౌరీపట్నం జంక్షన్, నర్సాపురం జంక్షన్, రాయపురాజుపేట, శీమునాపల్లి, ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉన్నా ప్రయాణికులు వేచి ఉండడానికి బస్‌ షెల్టర్లు లేవు. కొన్ని చోట్ల గ్రామాలు దూరంగా ఉండడంతో ఆయా జంక్షన్లలో మరీ దయనీయంగా ఉంది.

స్కూళ్లు ప్రారంభం కావడం, వర్షాకాలం వచ్చేయడంతో సాధారణ ప్రయాణీకులతోపాటు రోజూ పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. షెల్టర్లు లేక వర్షంలో తడుస్తూనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా పాలకులు ప్రయాణీకుల దుస్థితి గమనించి బస్‌ షెల్టర్లు కట్టించాలని జనం కోరుతున్నారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క బస్‌షెల్డర్‌ కూడా గత ప్రభుత్వం నిర్మించలేదు. అసలే ఎండలు మండిపోవడం, అకాల వర్షాలు కురవడంతో ప్రయాణీకులు తలదాచుకోడానికి నిలువు నీడలేకుండా ఉంది. చెట్ల కింద ఉన్నా, కొన్ని గ్రామాలకు జంక్షన్ల వద్ద చెట్లు కూడా లేవు. బస్సులు కూడా సమయానికి రాకపోవడంతో ప్రయాణీకులు చాలా అవస్థలు పడుతున్నారు. తమ గ్రామం అనకాపల్లి–చోడవరం రోడ్డులో ఉన్నప్పటికీ బస్‌ షెల్టర్‌ లేదని గంధవరం గ్రామస్థులు వాపోతున్నారు.

తమ రూట్‌లో ఒకటి రెండు బస్సులే నడుస్తున్నాయని, అవికూడా సకాలంలోరావని, ఆ బస్సుకోసం గంటల తరబడి రోడ్డుపై నిలబడాల్సి వస్తుందనీ, ఎండకి ఎండి, వర్షానికి తడిసి నిలబడాల్సి వస్తుందని, బస్‌ షెల్టర్‌ కోసం పలుమార్లు గత ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఆయన కనీసం పట్టించుకోలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే అయినా చర్యలు తీసుకొని తమ జంక్షన్‌ వద్ద బస్‌షెల్టర్‌ నిర్మించాలని కోరుతున్నారు వీఆర్‌పేట వాసులు.