అసౌకర్యాల నడుమ రోగులకు చికిత్స

140

విశాఖపట్నం, జూన్ 22 (న్యూస్‌టైమ్): పాడేరు మండలంలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అసౌకర్యాల నడుమ వైద్యం అందుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ కేంద్రమైన పాడేరు మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యం కోసం వెళ్లిన రోగులకు సరైన వైద్యం అందక గర్భిణుల సైతం అవస్థలు పడ్డారు. సెలేన్ బాటిల్స్ ఎక్కించేందుకు మంచాలు లేక ఒక్కొక్క మంచానికి ఇద్దరు ముగ్గురు చొప్పున రోగులకు పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు.

రోగులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. గత వారం తేనెటీగల దాడితో వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన వారికి వైద్యం అందించలేని దుస్థితిలో ఒక వృద్ధురాలు మరణించిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న స్థానిక ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డికె బాలాజీ పలు ఆదేశాలు జారీచేసిన వైద్య అధికారులు పట్టించుకోలేని దుస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉన్నా నిధులతో మౌలిక సదుపాయాలు అందించాలని సరిపోని ఎడల అదనపు నిధులు ఇస్తామని చెపుతున్నా కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. అనేక సంవత్సరాలు గడుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు స్థానిక ఏరియా ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిగా మారిన అదే దుస్థితిలో నెలకొని ఉంది.

దీనిపై అధికారులు స్పందించిన దాఖలాలు లేవని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు మాత్రం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప కార్యరూపం దాల్చేందుకు కృషి చేయడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి మౌలిక వసతులు కల్పించి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తారని రోగులు కోరుతున్నారు.