పవర్‌ ఫైనాన్స్‌‌కు జవసత్వాలు!

170

ప్రభుత్వరంగ సంస్థల్ని నిర్వీర్యం చేసే చర్యలను ఒకపక్క కొనసాగిస్తూనే కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలకు నూతన జవసత్వాలు నింపే ప్రయత్నాలనూ ముమ్మరం చేస్తోంది. పీఎఫ్‌సీ ఆర్ధిక పరిపుష్టికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్ఈసీ)ని ఆ సంస్థలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆర్ఈసీ వాటాలు పీఎఫ్‌సీకి దక్కేలా ఏర్పాట్లు చేసింది.

ఈ నేపథ్యంలో రెండు సంస్థల షేర్లూ భారీగా ర్యాలీ చేశాయి. ఒక దశలో దాదాపు 8 శాతం విలువ పెరిగింది. ఈ విషయాన్ని పీఎఫ్‌సీ అధికారికంగా వెల్లడించింది. దాదాపు 52.63 శాతం వాటా లభించినట్లు పేర్కొంది. ఈ డీల్‌ విలువ దాదాపు రూ.14,500 కోట్లు. దీనికి పీఎఫ్‌సీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆమోద ముద్ర కూడా లభించింది. దీంతో ఆర్‌ఈసీ షేరు ఏకంగా 52 వారాల అత్యధిక స్థాయి అయిన రూ.153కు చేరింది. ఉమ్మడిగా దాదాపు 25 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. ఆర్‌ఈసీలో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాకు ఉన్న షేర్లను పీఎఫ్‌సీ కొనుగోలు చేసింది. మరోపక్క పీఎఫ్‌సీ షేరు దాదాపు 6 శాతం పెరిగి రూ.120 మార్కును తాకింది. మరో రూ.3 పెరిగితే 52 వారాల గరిష్ఠాన్ని చేరినట్లవుతుంది.

పీఎఫ్‌సీ సంస్థ విద్యుత్తు రంగంలో అతిపెద్ద రుణదాతగా ఉంది. విద్యుత్తు తయారీ, పంపిణీ తదితర రంగాలకు ఇది ఫైనాన్స్‌ చేస్తోంది. ఇంకోపక్క, ఆర్‌ఈసీ ప్రభుత్వం చేపట్టే సౌభాగ్య ప్రాజెక్టు, ఇతర పథకాలకు నిధులను అందజేస్తోంది. ఇదిలావుండగా, సోమవారం భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కాస్త కోలుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 95 పాయింట్లు బలపడి 37,904 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11,387 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 68.93 వద్ద కొనసాగింది. నరేశ్‌ గోయల్‌ నిష్ర్కమణతో జెట్‌ ఎయిర్‌వేస్ షేర్లు ఊపందుకున్నాయి.

ఆ కంపెనీ షేర్లు దాదాపు 7 శాతం మేర లాభపడ్డాయి. అలాగే జీఎమ్‌ఆర్‌ ఇన్ఫ్రా, డీఎల్‌ఎఫ్‌, ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ పవర్‌, ఎమ్‌ఎమ్‌టీసీ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, స్పైస్‌జెట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, జేకే సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. కాగా, సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు మసాయోషి సన్‌ అమెజాన్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. కాకపోతే డీల్‌లో 30 మిలియన్‌ డాలర్ల విషయంలో తేడా రావడంతో డీల్‌ కుదరలేదు. ఈ విషయాన్ని సన్‌ మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. దాదాపు 30 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అప్పట్లో తాను 100 మిలియన్‌ డాలర్లను ఆఫర్‌ చేయగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్‌ మాత్రం 130 మిలియన్‌ డాలర్లను కోరినట్లు వెల్లడించారు.

‘‘నేను ఇటీవల బెజోస్‌ను కలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని చర్చించుకొని నవ్వుకున్నాం. కాకపోతే అప్పట్లో నేను గొప్ప అవకాశాన్ని వదులుకున్నాను. అప్పట్లో నా వద్ద అంత డబ్బులేదు. కానీ ఊహా, అంచనాలు మాత్రం నిజం’’ అని వెల్లడించారు. రెండేళ్ల క్రితం కూడా అమెజాన్‌లో వాటాలు కొనేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచారు. ఇప్పుడు అమెజాన్‌ మార్కెట్‌ విలువ 860 బిలియన్‌ డాలర్లు. అంటే ఒకొ వేళ సన్‌ 30 శాతం వాటా కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు అది 260 బిలియన్‌ డాలర్లకు సమానం అన్నమాట. కాకపోతే చైనాకు చెందిన ఆన్‌లైన్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌లో 132 బిలియన్‌ డాలర్ల విలువైన వాటాలు సాఫ్ట్‌బ్యాంక్‌కు ఉన్నాయి.

ఇదిలావుండగా, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ ఇప్పుడు ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా పలు మాల్స్‌లో 100 అమెజాన్‌ కియోస్కీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఆ మాల్స్‌లో అమెజాన్‌కు చెందిన కిండ్లె ఈబుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటివి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఆన్‌లైన్‌ దిగ్గజం ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి రావడానికి వీటిని వేదికగా వాడుకుంటోంది. ఇప్పటికే ఈ మాల్స్‌లో వాడదామనుకుంటున్న కియోస్కీలను రెండేళ్ల క్రితమే బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్‌ల్లో అమెజాన్‌ పరీక్షించింది. రెండిటిని బెంగళూరులో, ఒకదానిని ముంబయి, మరో దానిని ఆహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసింది. గత వారమే నోయిడాలోని లాజిక్స్‌ మాల్‌లో ఐదో కియోస్కీని ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం అమెజాన్‌ కియోస్కీకి దాదాపు 70-80 చదరపు అడుగుల స్థలం అవసరమవుతోంది. ‘‘భవిష్యత్తును మనం అంచనావేయలేము. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కస్టమర్లకు అత్యుత్తమ అనుభవాన్ని అందజేస్తాము’’ అని అమెజాన్‌ ప్రతినిధి పేర్కొన్నారు. వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని ఇచ్చేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కియోస్కీల వద్దకు కస్టమర్లు వచ్చి కిండ్లె, ఫైర్‌టీవీ, ఎకో వంటి పరికరాలు ఎలా పనిచేస్తాయో నేరుగా తెలుసుకొంటారు. అక్కడ వారి సందేహాలు తీరాక వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెజాన్‌ కొన్నేళ్లపాటు ఈ విధానాన్ని పరిశీలించింది. ఆ తర్వాత అమెరికాలో దాదాపు 80 వరకు కియోస్కీలను ఏర్పాటు చేసింది.