గోదావరి… మత్స్యసిరి

262

రాజమండ్రి, జూన్ 22 (న్యూస్‌టైమ్): అమృతమయమైన గోదావరి నీటిలో అనంతమైన మత్స్యసంపద దాగి ఉంది. వేనవేల సంవత్సరాల నుంచి ఇలా ఈ గోదావరి పరీవాహక ప్రాంతమంతా దక్షిణ భారతదేశంలోనే అరుదైన ప్రాంతంగా పేరు పొందింది. జీవనది అయిన గోదావరి వేల కుటుంబాలకు జీవనాధారం… గోదావరి నదీపాయలు అద్భుతమైన మత్స్యసంపదకు జలాశయాలు. నదీపాయల్లో లభ్యమయ్యే మత్స్య సంపద అంటే ఎంతటి వారైనా మక్కువ చూపాల్సిందే.

ఎగువ గోదావరి నుంచి దిగువ గోదావరి వరకూ మత్స్యలభిస్తూనే ఉంటుంది. రుచికే కాదు… గోదావరి చేప తింటే ఆరోగ్యం. అందుకే ఎంతటివారైనా గోదావరి చేప రుచికి దాసోహం అంటారు. గోదావరి జలాలు అనంతమైన మత్స్యసంపదకు నెలవు. గోదావరి ప్రాంతంలో నీరుంటే చాలు అక్కడ మత్స్యసంపద పుట్టుకొస్తుంది.సుమారు 1500 కిలోమీటర్లు ఉన్న గోదావరి నదిలో వెయ్యి కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంలో, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా గోదావరి మత్స్యసంపద లభ్యమవుతోంది.

ఎగువ ప్రాంతం మాట ఎలా ఉన్నా గోదావరి చేపలు అనగానే అందరి కంటే ముందు గుర్తుకొచ్చేది పులస. ఇది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ తదుపరి ఉన్న గోదావరి నీటిలో లభిస్తుంది. గోదావరికి వరద నీరు రాగానే సముద్ర ప్రవాహంలోని ఇలస చేపలు వరద నీటిలో ప్రవేశించి పులసగా మారుతాయి. అంతే కాకుండా ఆ చేప రకాల్లో ఖరీదైన పండుగొప్ప లభిస్తుంది. దిగువ గోదావరి నీటి నుంచి కాలువల్లో కూడా ఈ రకం చేప బాగా పెరుగుతుంది. ఇటీవల ఉభయ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో అనేక రకాల చేపలు పెంచడం వల్ల వాటి నీరు చేరి ఇంకా పలు రకాల చేపలు లభ్యమవుతున్నాయి.

ఉప్పుటేరులో రామలు, రొయ్యలు, పీతలు వంటివి లభ్యం కావడం గమనార్హం. గోదావరి నీటికాల్వల్లో బొమ్మిడాయలు లభిస్తాయి. వీటితో పాటు అనేక రకాల తినే పాములు లభ్యమవుతాయి. ఒకనాడు గోదావరి నీటిలో మొసళ్ల సంచారం బాగా ఉండేది. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి. నదీపాయల్లో కార్తీక మాసం సమయంలో లభ్యమయ్యే ‘చీరమేను’కూ డిమాండే. ముఖ్యంగా పండుగొప్పలు, కట్టిపరిగలు, కొయ్యింగలు, దొందులు, జెల్లలు, పీతలు, రొయ్యలు, మెత్తళ్లు, గుడ్డాకురాయిలు, మాగలు, మార్పులు, ఇంగిడాయలు, వాలుగలు, బొమ్మిడాయలు, బొచ్చులు వంటి రకరకాల మత్స్య ఉత్పత్తులు గోదావరి నదుల ద్వారానే లభ్యమవుతాయి. ఈ మత్స్య ఉత్పత్తులు స్వచ్ఛమైనవిగా ఉండడం, తింటే ఆరోగ్యం..అందుకే అధిక ధరలను వెచ్చించి ఈ చేపలను కొనుగోలు చేస్తారు. నదుల్లో దొరికిన వెంటనే ఈ ఉత్పత్తులు క్షణాల్లో అమ్ముడైపోతాయి. ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు ఈ ఉత్పత్తులు ఎగుమతులవుతాయి.

దీని ద్వారా చేపల వేటదారులు భారీ లాభార్జనలు చేస్తారు. జీవనదిగా ప్రసిద్ధి చెందిన గోదావరి ఎందరో జీవితాలకు జీవనాధారమైంది. వేల కుటుంబాల వారు నదీ పాయల్లో వేటే లక్ష్యంగా జీవిస్తారు. అఖండ గోదావరి నుంచి కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయల వెంబడి నిత్యం చేపల వేటే జీవనంగా మత్స్యకారులు కుటుంబాల వారు బతుకుతున్నారు. వేకువజామునే పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా నదీపాయల్లో మత్స్యసంపదను వేటాడుతూ జీవనం సాగించే మత్స్యకార పల్లెలు కోనసీమలో కోకొల్లలుగా కనిపిస్తాయి. గ్రామ, మండలాల వారీగా ఆయా సముద్రపాయల్లో హద్దులు నిర్ణయించుకుని నదుల్లో మత్స్య సంపదపై సర్వహక్కులు కలిగి ఉంటారు.

హద్దులు మీరితే ఒక్కొక్కసారి కల్లోలమే. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమై ఘర్షణలు జరిగిన పరిస్థితులకు మత్స్యసంపద వేట ఒక కారణమైన సంఘటనలెన్నో ఉన్నాయి. గోదావరి చేపలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి.వీటిలో ముఖ్యమైనది పులస. గోదావరి వరద వచ్చిన సమయంలోనే ఇది లభిస్తుంది. వాస్తవానికి ఇది సముద్రంలో పుట్టిన విలస చేప. గోదావరికి కొత్తనీరు వచ్చినప్పుడు ఎదురొచ్చి ఎర్రనీటిలోని నురగను తిని రుచికరంగా తయారవుతుంది. దీని ఖరీదు వేలల్లో ఉంటుంది.

ధవళేశ్వరం దిగువ గోదావరి పాయల్లో మాత్రమే ఇది లభ్యమవుతుంది. గోదావరి రొయ్యలకు, పండుగొప్పలకు కూడా మంచి డిమాండ్‌ ఉంది. ఇవికాకుండా కట్టె పరిగెలు, మాఘ, సందువా, సొర (దిగువ గోదావరి), ఇసుక దొందులు, తుళ్ళు, వంజరం, కడిశలు, బంగారుతీగ, చుక్కచేపలు, జెల్లలు, గొల్లిగాయలు, గొరకలు, చావిడాలు, గడ్డిచేప, ఇంగి లాయిలు,మార్పులు, తాబేళ్ళు, పీతలు, పాముజాతిచేపల్లో మలుగు, తెంబేలు వీటిలో కొన్ని రకాలు దిగువ గోదావరిలో ఎక్కువ లభిస్తాయి.