పెన్నుల్లో ‘రత్నం’

37

పాతతరానికి ‘రత్నం పెన్’ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్‌గా దీనికి ప్రాముఖ్యత ఉంది. 1930లో రాజమండ్రిలో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాల తయారీని కొనసాగిస్తూ వస్తోంది. 80 ఏళ్ళ పైచిలుకు ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో పెన్నుల రంగంలో అడుగుపెట్టి, అలనాడు గాంధీజీ ప్రశంసలు అందుకున్న రత్నం పెన్ ఇప్పుడు మూడవ తరం భాగస్వామ్యంతో రత్నం పెన్, రత్నం బాల్ పెన్ వర్క్స్‌గా విరాజిల్లుతోంది.

కళలకు, సంస్కృతికి ఆలవాలమైన రాజమహేంద్రవరం స్వాతంత్ర్య సమరవీరులకు, త్యాగాధనులకూ పెట్టింది పేరే. ఇక కీలకమైన స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ స్ఫూర్తిని జీర్ణించుకుని ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన ఈ నగరం ‘కలం’ (పెన్ను) పరిశ్రమకు రత్నం పెన్ వర్క్స్ నాంది పలికింది. ఎందరో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి ముగ్దులయ్యారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో స్వదేశీ నినాదానికి వేదికగా నిలిచిన ఈ సంస్థ 85 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కె.వి.రత్నం బ్రదర్స్ పేరిట స్వర్గీయ కోసూరి వెంకటరత్నం నెలకొల్పిన రత్నం పెన్స్ సంస్థ రత్నం హయాంలోనే రత్నం పెన్ వర్క్స్, రత్నం బాల్‌పెన్ వర్క్స్‌గా విడివడింది. ప్రస్తుతం రెండు సంస్థలూ వ్యాపారంలో విరాజిల్లుతున్నాయి.

దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ‘రత్నం పెన్’ ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నం కలసి, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నం అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నం మొగ్గు చూపారట.

ఏ విధంగా పెన్ తయారు చేయాలనే దానిపై అప్పట్లో సర్వే కూడా చేసారట. మచిలీపట్నం అయ్యగారి రామమూర్తి, మద్రాస్ కంపెనీ నుంచి సూచనలు తీసుకుని, 1930లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు. రత్నం పెన్‌ని సబ్ జడ్జి కృష్ణమాచార్య తొలిసారిగా వాడారు. 1932లో హిందూ పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరైన న్యాపతి సుబ్బారావు పంతులు షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా వచ్చిన ఆర్డర్ మేరకు వెండితో రెండు పెన్నులు తయారుచేసి, బంగారం పాళీలు అమర్చి అందించారు. అప్పట్లో ఈ విధంగా రూపొందించిన పెన్ను ఖరీదు కేవలం రెండు రూపాయల పావలా.

ఇక 1933లో రత్నం పెన్ గాంధీజీకి పంపిస్తే, ఇది విదేశీ ముద్రగా ఉందని తిప్పి పంపేసారట. ఆల్ ఇండియా విలేజ్ ఇండస్త్రీస్ సెక్రటరీ జెఎసి కమార్ రాజమండ్రి వచ్చి, రత్నం పెన్నులకు ముడిసరుకు కోసం లైసెన్స్ ఇస్తామని, అందుచేత శాంపిల్స్ తయారుచేసి ఇవ్వాలని అనడంతో ఎబోనైట్, ఎరిడియం పాయింట్లతో రెండు పెన్నులను రత్నం తయారుచేసి ఇచ్చారు. వీటిని 1935లో గాంధీజీకి అందించడంతో విదేశీ కలాలకు ప్రత్యామ్నాయంగా వుంది అని అభినందిస్తూ లేఖ పంపారు.

దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు రత్నం పెన్నులను వాడారు. మరెందరో రత్నం సంస్థను దర్శించారు. 1936లో తిరువనంత పురం మహారాజా, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, వివి గిరి, 1937లో పండిట్ నెహ్రూ, సి.ఆర్.రెడ్డి, మొసలికంటి తిరుమలరావు, ఆచార్య వినోబా భావే, దుర్గాబాయి దేశముఖ్, కమలాదేవి ఛటోపాధ్యాయ, 1947లో మద్రాస్ గవర్నర్ ఆర్చ్ బాల్డ్ నై, 1955లో టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, 1958లో నీలం సంజీవరెడ్డి (మాజీ రాష్ట్రపతి), ఆనాటి గవర్నర్ భీమ సేన్ సచార్, తదితరులు రత్నం పెన్ వర్క్స్ సందర్శించి, పెన్నులు స్వీకరించారు. రష్యా ప్రెసిడెంట్ బల్కానియాన్ క్రుచేవ్, అమెరికా అధ్యక్షుడు ఐసన్ హోవర్, జర్మనీ చాన్సలర్ అర్బన్ నాన్ తదితర ప్రముఖులకు రత్నం పెన్నులు పంపబడ్డాయి.

కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, ప్రస్తుత పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, శృంగేరీ పీఠాధిపతి, పూరి శంకరాచార్య, శివానంద ఆశ్రమ అధిపతి ఇలా ఎంతో మంది స్వామిజీలు రత్నం పెన్నులను స్వీకరించి, ఆశ్సీస్సులు అందించారు.

రత్నం బాల్ పెన్ వర్క్స్ (కెవి రత్నం అండ్ సన్స్)ని డాక్టర్ కె. వి.రమణమూర్తి నిర్వహిస్తున్నారు. వారి కుమారులు గోపాలరత్నం (గోపి), చంద్రశేఖర్ కూడా భాగస్వామ్యం వహించడంతో మూడోతరం ఈ పరిశ్రమలో మిళితమైంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ, అతి పెద్ద, అతి చిన్న పెన్నులు తయారు చేసి రికార్డు సృష్టించి, వెలుగొందుతున్న ఈ సంస్థ ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలతో కలిపి 8 పుష్కరాలను చూసింది. ఆయుర్వేదంలో డిప్లొమా చేసిన డాక్టర్ కెవి రమణమూర్తి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, 80 ఏళ్ళ పైబడిన వయస్సులో కూడా ‘రత్నం బాల్ పెన్ను’ల రూపకల్పనలో శ్రమిస్తున్నారు. కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 2008లో అతి పెద్ద పెన్ రూపొందించి, ఆనాటి స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి అందించారు. ఆతర్వాత అతి చిన్న సైజులో బాల్, ఇంకు పెన్నులను బంగారంతో తయారు చేయగా, ఆనాటి గవర్నర్ ఎన్.డి.తివారి రాజ్ భవన్‌లో ఆవిష్కరించారు.

రత్నం బాల్ పెన్ వర్క్స్‌కి అనేక అవార్డులు లభించాయి. 2012 డిసెంబరులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైన రత్నం సన్ వర్క్స్, 2014 మేలో ఎవరెస్ట్ వరల్డ్, సృజన పత్రికలలో చోటు దక్కించుకుంది. 2010లో హిందూ ఎడిటర్ ఎన్. రామ్, డిసెంబరు 18న సి.బి.ఐ మాజీ జె.డి డాక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ, ఎపి రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఇలా ఎందరో ఈ సంస్థను సందర్శించి, అభినందించారు.

2015 గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరుడు-గోదావరి మాత-గోదావరి గలగలలు-పుష్కర ప్రారంభ తేదీ (14.7.15)లను చిత్రించి, బంగారు పాళీతో రూపొందించిన వెండి పెన్నును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్కరాల 7వ రోజు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఆవిష్కరించారు. ‘రత్నం పెన్ ‘ చరిత్ర తెలుసుకుని, పులకించిపోయారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్‌గా కూడా దోహదపడుతున్న ఈసంస్థను విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 60 మంది వచ్చి, పెన్నుల తయారీని పరిశీలించి వెళ్ళారు. రత్నం కలాలు ప్రపంచీకరణలో పోటీని తట్టుకుని, అజేయంగా కొనసాగుతున్నాయి. రత్నంపెన్, రత్నం బాల్ పెన్ సంస్థలు తమ జైత్రయాత్ర కొనసాగిస్తూ శత వసంతాలకు పరుగులు తీస్తున్నాయి.