దాయాది చెంతన నియంత్రణ రేఖ!

281

దేశ సరిహద్దుల మధ్య నియంత్రణ రేఖలు ఉండడం సర్వసాధారణం. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఆయా ప్రాంతాలు చాలా వరకు కేవలం సందర్శన స్థలాలుగానే మిగిలిపోతాయి. కానీ, భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉన్న కాశ్మీరు భూభాగాలను విడదీసే రేఖ మాత్రం అనునిత్యం ఉదృక్తితలకు దారితీస్తూనే ఉంటుంది. ఈనాటికి కూడా అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తింపు పొందలేదీ ఈ నియంత్రణ రేఖ.

అయితే, వాస్తవానికి ఇది సరిహద్దుగానే ఉంది. తొలుత సంధిరేఖగా పిలవబడిన ఈ రేఖను 1972 జూలై 3 నాటి సిమ్లా ఒడంబడిక తరువాత నియంత్రణ రేఖగా పిలుస్తున్నారు. భారత్ అధీనంలో ఉన్న కాశ్మీరు సంస్థాన భాగం జమ్మూ కాశ్మీరు రాష్ట్రం కాగా, పాకిస్తాను అధీనంలో ఉన్న రెండు భాగాలను గిల్గిట్-బల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీరు అని పిలుస్తారు. పాకిస్తాన్ దీన్ని ఆజాద్ కాశ్మీరు అని పిలుస్తుంది. నియంత్రణ రేఖ కాశ్మీరులోని అనేక గ్రామాలను, కుటుంబాలనూ విడదీసింది. జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి, చైనా అధీనంలో ఉన్న అక్సాయ్ చిన్‌కూ మధ్య ఉన్న సంధి రేఖను వాస్తవాధీన రేఖ అని అంటారు.

ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తారు. 1933 నాటి పాకిస్తాను ప్రకటన ప్రకారం కాశ్మీరు సంస్థానం ప్రతిపాదిత పాకిస్తాను యొక్క భూభాగాల్లో ఒకటి. ఇప్పటికీ కాశ్మీరు మొత్తం పాకిస్తానుకు చెందినదే అని పాకిస్తాను వాదిస్తుంది. కాశ్మీరు సంస్థానాధీశుడైన మహారాజా హరిసింగ్, మౌంట్‌బాటెన్ సూచన మేరకు కాశ్మీరును భారత్‌లో విలీనం చేసాడు. దాంతో కాశ్మీరు సంస్థానం మొత్తం భారత్‌లో కలిసినట్లేనని భారత్ ప్రకటించింది. ఈ కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీరు కూడా భారత్‌లో అంతర్భాగమేనని భారత్ వాదన. నియంత్రణ రేఖ నుండి 150 గజాల లోపల భారత్ ఒక కంచెను నిర్మించింది. ఈ కంచె మొత్తం 550 కిలోమీటర్ల పొడవుంటుంది. పాకిస్తాను వైపు నుండి ఉగ్రవాదులు భారత్‌లోకి రాకుండా నిరోధించేందుకు ఈ కంచెను భారత్ నిర్మించింది.

ఈ కంచెను రెండు వరుసలుగా 8 నుండి 12 అడుగుల ఎత్తుతో, ముళ్ళతీగలతో ఏర్పాటు చేసారు. రెండు వరుసల మధ్య మందుపాతరలను అమర్చారు. కంచెకు విద్యుత్తు సరఫరా ఉంటుంది. కదలికలను గమనించే సెన్సర్లు, థెర్మల్ ఇమేజింగు సెన్సర్లు, లైటింగు వ్యవస్థలు, అలారములూ ఉంటాయి. ఈ వ్యవస్థలు, కంచె దాటబోయిన ముష్కరులను గుర్తించి భారత దళాలను సత్వరమే అప్రమత్తం చేస్తాయి. 1990ల్లో మొదలైన కంచె నిర్మాణం, 2000లలో భారత పాకిస్తాను దళాల మధ్య ఘర్షణల కారణంగా నెమ్మదించింది. 2003 నాటి సంధి ఒడంబడిక తరువాత నిర్మాణం తిరిగి మొదలై, 2004 సెప్టెంబరు 30. భారత సైన్యం అంచనాల మేరకు, కంచె కారణంగా ఉగ్రవాదుల చొరబాటు 80% మేరకు తగ్గిపోయింది.

ఈ కంచె ద్వైపాక్షిక ఒప్పందాలను, ఈ ప్రాంతానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి తీర్మానాలనూ అతిక్రమిస్తోందని పాకిస్తాను ఆరోపించింది. ఐరోపా సమాఖ్య భారత్ చర్యను సమర్ధించింది. ఉగ్రవాదుల చొరబాటును అరికట్టే సాంకేతికతను మెరుగు పరుస్తుందని అది చెప్పింది. 1972 సిమ్లా ఒప్పందం నియంత్రణ రేఖను కచ్చితంగా నిర్వచించిందని కూడా ఈ సందర్భంగా ఐరోపా సమాఖ్య తేల్చి చెప్పింది.