జలవివాదాలపై సీఎంల కీలక భేటీ

10

హైదరాబాద్: జల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న సమావేశం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కీలక భేటీగా భావిస్తున్న ఈ సమావేశం అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రాధమికంగా అనుకున్నప్పటికీ ఎక్కడ? ఎన్ని గంటలకనేది మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉందని ఏపీ రాష్ట్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి వర్గాలు చెప్పాయి.

ముఖ్యమంత్రుల భేటీపై ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బ్రిజేష్​కుమార్​ ట్రైబ్యునల్​, కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జల వివాదాలు పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతాయనే అభిప్రాయంతో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు బచావత్​ ట్రైబ్యునల్​ అప్పట్లో 811 టీఎంసీల నీటిని కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఇందులో ఆంధ్రప్రదేశ్​ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొంటున్నాయి. పునర్విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కను నిద్ధరించారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నది ట్రైబ్యునల్​ నిర్ధరించాల్సి ఉంది. ఇదే విషయంపై ట్రైబ్యునల్​ ఎదుట వాదనలకు ఇరు రాష్ట్రాలకూ భారీగానే ఖర్చవుతోంది. దీని కోసం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్​ రెండున్నర రెట్లు ఎక్కువగా ఖర్చు చేసిందన్న ప్రచారం కూడా ఉంది.

బచావత్​ ట్రైబ్యునల్‌​లోనే అన్యాయం జరిగిందని, దీనిని సవరించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేసు వేసింది తెలంగాణ. వీటన్నింటిపై చర్చించుకొని రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే అదే ట్రైబ్యునల్​ తీర్పులోనూ వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరు, అసలు ఈ బోర్డుల అవసరం ఉందా? అనే అంశాలపైనా ముఖ్యమంత్రుల భేటీలో చర్చించే అవకాశం ఉంది.