గుండెపోటు వస్తుంది జాగ్రత్త!

83

లండన్: ఔను… ఏ మాత్రం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రాణం పోయినట్లే. రోజుకు కనీసం పది గంటలకుపైగానే పనిచేసే వారికి అయితే ఇక చెప్పనక్కర్లేదంటున్నారు వైద్య నిపుణులు. అటువంటి కష్టజీవులకు గుండెపోటు త్వరగా వచ్చే ప్రమాదం ఉందట. ఇదే గనుక నిజమైతే… తస్మాత్‌ జాగ్రత్త! రోజూ 10 గంటలకు మించి పని చేసేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పారిస్‌ హాస్పిటల్‌ అండ్‌ ఏంజెర్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పరిశోధనల్లో భాగంగా 1,43,592 మంది డేటాను వారు పరిశీలించారు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో 42,542 మంది తాము పదేళ్లుగా రోజుకు సుమారు పది గంటలు పనిచేస్తున్నామని చెప్పారట. వీరిలో 1224 మంది గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ లెక్కల ఆధారంగా పది గంటల్లోపు పనిచేసిన వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 29 శాతం ఉంటే అంతకుమించి పనిచేసేవారికి ఈ రిస్క్‌ 45 శాతం అధికంగా ఉన్నట్టు తేల్చారు నిపుణులు. కాగా, సాధారణంగా గుండెపోటు రావడానికి ముందుగా కొన్ని రకాల లక్షణాలు బహిర్గతం అవుతాయి. బహిర్గతం అయ్యే లక్షణాలు గుండె సంబంధించినవే కాకుండా శరీర భాగాలలో ఎక్కడైనా కలుగవచ్చు.

వీటిని తెలుసుకోవటం వలన గుండెపోటు రావటానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. శ్వాసలో ఇబ్బందులు కలిగినపుడు ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధి వలన కాదు అనుకుంటారు, కానీ కొన్ని రకాల గుండెకి చెందిన వ్యాధులు కలిగినపుడు శ్వాసలో ఇబ్బందులు వ్యాధి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి. ఇలా శ్వాసలో ఇబ్బందులు కలుగటం వంటి లక్షణాలు బహిర్గతమైతే మాత్రం గుండె ప్రమాదానికి గురవటం వలన లేదా గుండె సమస్యలకు గురవటం వలన ఇవి కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు కలిగినపుడు అరుదుగా కండరాలలో సమస్యలు కలుగుతాయి.

ఈ రకమైన వ్యాధులు కలిగినపుడు భౌతిక కార్యకలాపాలు జరపటానికి ఇబ్బందులుగా, కాళ్ళలో తిమ్మిరిలు లేదా పక్షవాతానికి గురి అయినట్లుగా అనిపిస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు, అనగా ఎలాంటి సూచనలు లేకుండా మూర్చపోవడం వంటివి గుండె సమస్యలకు గురైనపుడు, ధమనులలో లేదా కారోటిడ్ అర్టెరీలో సమస్యలు ఏర్పడినపుడు నాడీ సమస్యలు కలుగుతాయి అని తెలిపారు వైద్యులు. అంతేకాకుండా గందరగోళంగా అనిపించటం, పేలవ పరిస్థితులు, పక్షవాతం వంటివి కూడా కలిగే అవకాశం ఉంది.

అదే విధంగా, గుండెలో సమస్యలు కలిగినపుడు చాలా అరుదుగా చర్మ సమస్యలు కలుగుతాయి అని కూడా వైద్యులు తెలిపారు. ఈ రకమైన వ్యాధులు కలిగినపుడు, రక్తనాళాలో రక్త ప్రసరణ తగ్గటం వలన వారి చర్మం నీలి రంగులోకి మారుతుందట. కొన్ని సమయాల్లో కాళ్ళు, చేతులు అధికంగా వేడికి గురవుతాయి. కవాటాలలో సమస్యలు లేదా గుండె సంబంధిత కండరాలలో సమస్యలు లేదా ఇన్ఫెక్షన్’లు లేదా ఆరైథ్మియా కలిగినపుడు వ్యక్తి అలసటకి గురవుతాడు. సాధారణంగా భౌతిక చర్యలు చేసినపుడు లేదా విశ్రాంతి తీసుకున్న తరువాత అధికంగా అలసటకి గురవుతారు.

రక్తనాళాలో లోపాల వలన, కవాటాలలో సమస్యల వలన లేదా ఆరైథ్మియా వలన నొప్పి కలుగుతుంది. చురుకుగా ఉండకపోవటం, ప్రతిసారి చాతిలో నొప్పి వంటివి కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధుల వలన కాళ్ళు, చేతులు, పాదాలలో, చీల మండలలలో వాపులు కలుగుతాయి. కవాటాలు, కండరాలలో లోపాల వలన వాపులు కలుగుతాయి. గుండెలో లోపాల వలన, ఉదర భాగం, కళ్ళ కూడా వాపులకు గురవవచ్చు. ఇదిలావుండగా, ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది. అందువల్ల ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం, ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం.

దీనికి ప్రత్యామ్నాయమే ఇఇసిపి. గుండె కండరాలకు రక్తం సరిగా అందక ఛాతి నొప్పి (యాంజైన) వస్తుంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దవడ, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. వికారంగా, అలసటగా ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉంటుంది. గుండె జబ్బుకు ఆడ, మగ భేదాలు లేవు. ఇప్పటి వరకూ మగవారికంటే ఆడవారికి గుండెపోటు ప్రమాదం తక్కువని ప్రచారంలో ఉంది. అయితే గుండెజబ్బు లక్షణాలకు లింగ భేదాలు ఉండవని వెల్లడైంది.

గుండెపోటుకు గురయ్యే వారిలో చెయ్యి లాగేయడం, ఊపిరి అందకపోవడం, చమట పట్టడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు స్త్రీ పురుషులిద్దరిలోనూ కనపడతాయని తెలిసింది. పైగా, మహిళల్లో సాధారణంగా అందరిలో కనపడే గుండెపోటు లక్షణాలతోపాటు, గొంతు, దవడ, మెడలోనూ అసౌకర్యం కలుగుతుందని తేలింది. తమకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని భావించడం వలన మహిళలు ఆ జబ్బుకు చికిత్స ఆలస్యంగా మొదలెడతారని, దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఇఇసిపి అంటే ఎన్‌హాన్స్‌డ్‌ ఎక్సర్నల్‌ కైంటర్‌ పల్షేషన్‌ అని అర్థం. మందులు, శస్త్ర చికిత్స లేకుండా గుండె జబ్బును నయం చేసే ప్రక్రియ ఇది. తద్వారా యాంజైనా నుంచి రోగికి విముక్తి కలుగుతుంది. చికిత్సలో భాగంగా రక్తపోటు పట్టీలను పీడనశక్తి ఉపయోగించి (కఫ్‌) కాళ్ల చుట్టూ కడతారు. గుండె కొట్టుకునే లయకు సమానంగా పీడనాన్ని విడుదల చేస్తారు. ఫలితంగా శరీరంలోని రక్తనాళాలన్నింటిలో రక్తసరఫరా అవుతుంది. ముఖ్యంగా గుండెలో. ఇఇపిపి ప్రక్రియలో భాగంగా మూసుకుపోయిన ధమనుల చుట్టున్న చిన్న రక్తనాళాలు (కొలటరల్స్‌) తెరుచుకుంటాయి. ఇవి రక్తప్రసరణను పెంచుతాయి. అంతేకాక గుండె కండరాలకి అందే రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకొస్తాయి.

తద్వారా గుండె పనిచేసే సామర్థ్యం పెరిగి గుండె నొప్పి (యంజైనా), ఆయాసం, దడ ఉండవు. అందుకే దీన్ని సహజ బైపాస్‌ అని అంటారు. ఈ చికిత్స ద్వారా గుండెలో చురుకుగా లేని రక్తనాళాలను కూడా తిరిగి సమర్థవంతంగా పనిచేయించొచ్చు. సహజంగా కొత్త రక్తనాళాలను ఏర్పరచొచ్చు. దీంతో గుండె కండరాలకు సమృద్ధిగా రక్తం అందుతుంది. ఒక్క మాటాలో చెప్పాలంటే గుండెకు పూర్తి స్థాయిలో రక్త సరఫరా చేయడం ఈ చికిత్స ముఖ్యఉద్దేశం. గుండె బైపాస్‌ సర్జరీ లేక స్టెంట్‌ చేయించుకున్న వ్యక్తుల్లో కొన్నిసార్లు స్టెంట్‌ లేక బైపాస్‌ గ్రాఫ్ట్స్‌ మళ్లీ మూసుకుపోతాయి.

దీంతో నొప్పి, ఆయాసం ఎక్కువై గుండె పంపింగ్‌ తగ్గే అవకాశముంది. ఇలాంటి వారు మళ్లీ బైపాస్‌ ఆపరేషన్‌ చేయించుకుంటే ప్రమాదం ఎక్కువుంటుంది. అలాంటి వారికి ఇఇసిపి చికిత్స సమర్థవంతంగా పనిచేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిన తర్వాత బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చికిత్స చేస్తారు. ఒకసారి బైపాస్‌ చేయించుకున్న తర్వాత పదేళ్ల తర్వాత మళ్లీ బైపాస్‌ చేయించకోవాల్సిన పరిస్థితులు రావొచ్చు. రెండోసారి బేపాస్‌ చేయించుకోవడం ప్రమాదం. యాంజియోప్లాస్టీ చేయించుఁన్న కొంత మందిలో స్టంట్‌ పెట్టిన ఏడాది తర్వాత ఆ రక్తనాళం మూసుకుపోయే అవకాశముంది.

ఇలాంటి రోగులకు బైపాస్‌ సర్జరీ, యాంజియోప్లాస్టీ అవసరం లేకుండా ఇఇసిపి ద్వారా చికిత్స చేయొచ్చు. అలాగే మందుల వాడకం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్సలు చేయరు. సాధారణంగా 35 సిట్టింగ్‌లలో చికిత్స మొత్తం పూర్తవుతుంది. రోజుకు గంటచొప్పున వారానికి ఆరు రోజులు చికిత్స చేస్తారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. శరీరం మీద ఎలాంటి కోత, కుట్లుండవు. గంటసేపు చికిత్స పూర్తయ్యాక ఇంటికి వెళ్లొచ్చు. ముఖ్యంగా గుండెపోటు, ఛాతిలో నొప్పి, హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులఁ ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ చికిత్స తర్వాత గుండె కండరాలకు రక్త సరఫరా బాగా జరగడం వల్ల ఛాతి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. మూసుకపోయిన ఆర్టెరీ చుట్టుపక్కల కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి ఈ చికిత్స దోహదం చేస్తుంది. గుండెకు కనీసం 20 శాతం రక్త సరఫరా పెరుగుతుంది. రక్తసరఫరా అందని భాగాలకి రక్తసరఫరా అందించడం ఈ చికిత్స ప్రత్యేకత. హృద్రోగాలను నిర్ధారించే పరీక్షలో ట్రెడ్‌ మిల్‌ టెస్ట్‌ ఒకటి. గుండె జబ్బులతో బాధపడేవారు ఎక్కువగా పరుగెత్తినా, వేగంగా నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం, ఛాతిలో నొప్పి రావొచ్చు. అందుకే హృద్రోగులు ట్రెడ్‌మిల్‌పై వేగంగా నడవలేరు. ఒక వేళ వేగాన్ని పెంచితే వారి రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంది. అయితే చికిత్స తీసుకున్న రోగులు అరగంట సేపు కిలోమీటరు దూరం నడిచినా అలపోరు. ఛాతిలో నొప్పి, ఆయాసం కలగవు.

ఇఇసిపి వల్ల గుండెకు 20 నుంచి 42 శాతం, మెదడుకు 22 నుంచి 26 శాతం, మూత్రపిండాలకు 19 శాతం రక్తప్రసరణ పెరుగుతుంది. 36 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వరకు ఇఇసిపి పరీక్ష చేయించుకోవచ్చు. 80 ఏళ్ల వయసులో కూడా ఈ పరీక్ష చేయించుకుని హాయిగా ఉన్నారు. బైపాస్‌ సర్జరీ/యాంజియోప్లాస్టీ/స్టెంట్‌ చికిత్సలు అయిన వారికి పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాల వల్ల, కార్డియోమయోపతి వల్ల హార్ట్‌ పంపింగ్‌ సామర్థ్యం తగ్గి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రావొచ్చు. ఇలాంటి వారిలో మందులతో పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి హార్ట్‌ ఫెయిల్యూర్‌ రోగులకు ఈ చికిత్స ద్వారా గుండె పంపింగ్‌ సామర్థ్యాన్ని పెంచొచ్చు. దీంతో మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకోవడం వాటి ద్వారా రక్తసరఫరా బాగా జరుగుతుంది. తద్వారా గుండె పనితీరు పెరుగుతుంది.

గుండె జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. నిజానికి గుండె జబ్బులు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉందని అంటున్నారు వైద్యులు. ఉదయాన్నే వాకింగ్ వెళ్లాలంటే చాలా బద్దకం. నిజానికి నడక గుండెకు మంచిది. అందుకే రోజూ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోండి. డైనింగ్ టేబుల్‌పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటుకు స్వస్తి చెప్పండి. రోజులో ఒకటిన్నర స్పూన్ (2400ఎం.జి) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. రోజూ ఐదు రకాల పండ్లు తినండి. ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఆల్కహాల్ అలవాటు ఉంటే రెండు పెగ్గుల కంటే ఎక్కువగా తీసుకోకండి.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది. పొగతాగే అలవాటు ఉంటే ఈ రోజే మానేయండి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను స్మోకింగ్ మరింత పెంచుతుంది. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి. బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి. ఏడాదికొకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. డయాబెటిస్ ఉంటే కనుక నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం మరవకండి.

షుగర్ ఉన్న వారికి(ముఖ్యంగా మహిళలు) గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్‌ స్ట్రోక్‌) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు,ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది.