ఆరుకోట్ల ఆంధ్రులకు హామీ ఇస్తున్నా…

108
  • లంచం అడిగితే సీఎం ఆఫీసుకే ఫోన్‌ చేయండి

  • యువతకు నాలుగు లక్షల వలంటరీ ఉద్యోగాలు

  • పింఛను దస్త్రంపై తొలి సంతకం చేసిన వైఎస్ జగన్

విజయవాడ, మే 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జగన్‌ ప్రసంగించారు.

‘‘వైఎస్‌ జగన్‌ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని గట్టిగా చెబుతున్నా. ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశా. వైఎస్సార్‌ ఫించను దస్త్రంపై ఏపీ సీఎంగా తొలి సంతకం చేస్తున్నా. వృద్ధాప్య పింఛను రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు జూన్‌ నెల నుంచి రూ.2,250 ఫించను ఇస్తాం. వచ్చే ఏడాది రూ.2,500, ఆతర్వాత ఏడాది రూ.2750, ఆ తదుపరి రూ.3వేలకు పెంచుతాం. ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో వలంటీర్లుగా నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగవకాశం కల్పిస్తాం.

ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమిస్తాం. గ్రామాలలో చదువుకున్న పిల్లలు సేవ చేయాలన్న ఆరాటం ఉన్న వారిని రూ.5వేల వేతనంతో వలంటీరుగా నియమిస్తాం. ప్రభుత్వ పథకాల్లో అవీనితి పారదోలేందుకు వలంటీర్లను నియమిస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకూ పనిచేయవచ్చు. గ్రామ సచివాలయం ద్వారా అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నాటికి మరో లక్షా 60 వేల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వ సేవలు ఎవరికి అందకపోయినా, లంచాలు కనిపించినా కాల్‌ సెంటర్‌ ద్వారా నేరుగా సీఎం ఆఫీసుకు ఫిర్యాదు చేయవచ్చు. సీఎం ఆఫీసు నంబరు మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం.

నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో పరిష్కరిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తాం. నవరత్నాల్లో ప్రతి ఒక్కటి తూ.చ తప్పకుండా అమలు చేస్తాం. ఏపీ సీఎంగా ఆరుకోట్ల ప్రజలకు హామీ ఇస్తున్నా. స్వచ్ఛమైన, అవినీతిలేని పాలన అందిస్తా. అవినీతి ఎక్కడ జరిగిందో ఏ ఏ కాంట్రాక్టుల్లో అవినీతి చోటుచేసుకుందో వాటిని రద్దు చేస్తాం. నిబంధనలు మార్చి ఎక్కువ మంది కాంట్రాక్టు పనుల్లో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తాం. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయింది.

సోలార్‌ పవర్‌, విండ్‌ పవర్‌ను ఇతర రాష్ట్రాల్లో గ్లోబల్‌ టెండర్‌ ద్వారా 2.65 పైసలు నుంచి మూడు రూపాయలకు కొనుగోలు చేస్తుంటే మన రాష్ట్రంలో విండ్‌ పవర్‌ రూ.4.84పైసలకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్‌ చేసుకుని దోచుకుంటోంది. పీక్‌ అవర్స్‌లో రూ.6లకు కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ మీ ముందు పెట్టి వాటిని రద్దు చేస్తాం. వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా ఉండేలా చూస్తాం. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అనుమతితో జ్యుడిషియల్‌ కమిషన్‌ వేస్తాం. కమిషన్‌ సూచనలకు అనుగుణంగా కాంట్రాక్టులు అప్పగిస్తాం. ఏడాది సమయం ఇస్తే అవినీతి లేకుండా అంతా ప్రక్షాళన చేస్తా. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని మాట ఇస్తున్నా’’ అంటూ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.