ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం

82

దేవుని ఆశీస్సులతో, నన్ను దీవించిన ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకార కార్యక్రమం.

Posted by YS Jagan Mohan Reddy on Wednesday, May 29, 2019

 

అమరావతి, మే 30 (న్యూస్‌టైమ్): నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. తొలుత జాతీయగీలాపన జరిగిన అనంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనబడే నేను’’ అంటూ తెలుగులో ప్రమాణం చేశారాయన. ప్రస్తుతానికి వైఎస్‌ జగన్‌ ఒక్కరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పీవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్‌ జగన్‌ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 11.54 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన స్వగృహం నుంచి విజయవాడకు జగన్ బయలుదేరారు. ఆయన వెంట వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల, బ్రదర్ అనిల్‌‌కుమార్ సభా ప్రాంగణానికి వచ్చారు.  మధ్యాహ్నం 12.14 గంటలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ  ప్రత్యేక వాహనంలో వైఎస్‌ జగన్‌ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు.

అనంతరం ఆయన స్టేజిమీదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేయగా ఒక్కసారిగా ప్రజలు చేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. ప్రమాణ స్వీకార సమయంలో ‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’’ అని అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అను నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచనని, లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జగన్ ప్రమాణంస్వీకారం చేశారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిషా సీఎం నవీన్‌పట్నాయక్, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అశేష అభిమానులు, వైసీపీ కార్యకర్తల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం హోదాలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్‌ అక్కడి విచ్చేసిన ఆయన కుటుంబసభ్యులను అప్యాయంగా పలకరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారోత్సవానికి అథితులుగా వచ్చిన కేసీఆర్‌, స్టాలిన్‌లను కూడా గవర్నరు పలకరించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌కు వీడ్కోలు పలికారు.

జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రేమాభిమానాలతో పాటు చంద్రబాబుపై మహా కసితో తమ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జగన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల రూపంలో చంద్రబాబుపై కసినంతా ప్రజలు తీర్చుకున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాలన్న ఉద్దేశంతో తమకు అఖండ​ విజయం అందించారని అన్నారు.

వైఎస్‌ జగన్‌ గొప్ప పరిపాలన ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. వైఎస్సార్‌ కంటే జగన్‌ గొప్ప పరిపాలన అందిస్తారని అభిప్రాయపడ్డారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని ప్రజలు కోరుకుని తమకు ఓటు వేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. ప​దేళ్లుగా తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ పడిన కష్టానికి ప్రతిపఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. జగన్‌లో ప్రజలు గొప్పనాయకుడిని చూశారు కాబట్టి అఖండ విజయం కట్టబెట్టారని అన్నారు.