మణిపూర్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం

128
  • 12 మంది ఎమ్మెల్యేల‌ మూకుమ్ముడి రాజీనామా

ఇంఫాల్, మే 30 (న్యూస్‌టైమ్): మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్‌లో మరుమారు సంక్షోభం తలెత్తింది. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నట్లనిపిస్తోంది. రాజీనామా చేసిన వీరు భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపించడంతో వారిలో ఒక సీనియర్‌ ఎమ్మెల్యే ఎట్టకేలకు స్పందించారు. ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరబోయే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న రెండు ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఇన్నర్‌ మణిపూర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్‌ సింగ్‌, అవుటర్‌ మణిపూర్ నుంచి నాగా పీపుల్స్‌ ఫ్రంట్ అభ్యర్థి గెలిచారు. ఈ కారణంగానే పార్టీని వీడుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు వారి రాజీనామా పత్రాలను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు గయ్‌ఖంగంకు అందించారు. కాగా, మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తంగా 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల అనంతరం 29 మంది కాంగ్రెస్‌ ఎమ్యెల్యేలు ఉండేవారు. అనంతరం వారిలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 21 నుంచి 29 చేరింది. ‘‘మేం ఇతర పార్టీలో చేరేందుకు రాజీనామా చేయలేదు. ఈ రాజీనామాల అనంతరం మా నియోజకవర్గాల్లో అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రజలకు పార్టీపై మళ్లీ నమ్మకం కలిగేలా చేస్తాం’’ అంటూ మణిపూర్‌ పీసీసీ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన కెహెచ్‌ జాయ్‌కిషన్‌ సింగ్ పేర్కొన్నారు.