జగన్‌‌పై శివసేన ప్రశంసల వర్షం

124

ముంబయి, మే 30 (న్యూస్‌టైమ్): వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ప్రశంసల వర్షం కురిపించింది. తాజా ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీని భారీ తేడాతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ని ‘విజయ వీరుడు’ అని అభివర్ణించింది. గురువారం వారి అధికారిక పత్రిక ‘సామ్నా’లో ప్రచురించిన సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే గెలిచిన వెంటనే నరేంద్ర మోదీని కలిసిన జగన్‌ ఏపీ రాష్ట్ర డిమాండ్లపై చర్చించారని గుర్తుచేశారు. వాటికి మోదీ అంగీకరించినట్లు పేర్కొన్నారు.

కానీ భాజపా మాత్రం రాష్ట్రంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల వేళ ఒడిశాలో సంభవించిన ఫొని తుపాను నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి అండగా నిలిచిందని తెలిపారు. అలాగే రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ప్రమాణస్వీకారానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాకపోవడంపై శివసేన మండిపడింది. ‘‘మోదీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని విపక్షాలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయి. మోదీ ఓ నియంత అంటూ ప్రచారం చేసిన వారిలో మమతా బెనర్జీ ముందున్నారు. కానీ మోదీ మాత్రం ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేయబోతున్నారు.

ప్రమాణస్వీకారోత్సవానికి రావడానికి మమత నిరాకరించారు. పోలింగ్‌ సందర్భంగా బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నది వాస్తవం. ఈ ఘటనల్లో చనిపోయిన వారి కుటుంబాలను ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని మమత సాకుగా చూపడం సమంజసం కాదు. వారు భారతీయులే. బంగ్లాదేశీయులు కాదు. ప్రధాని ప్రమాణస్వీకారానికి హాజరయ్యే హక్కు వారికి ఉంది’’ అని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో రాసుకొచ్చింది. ఫలితాల అనంతరం ప్రతిపక్షాలపై మోదీ ఒక్క విమర్శ కూడా చేయకపోవడాన్ని శివసేన ప్రశంసించింది. మోదీ తన పనితీరుతో ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నారని, కొత్త ప్రభుత్వం మరింత సహనం, మానవత్వ విలువలతో పనిచేస్తుందని వ్యాఖ్యానించింది.

పాక్‌ ప్రధానిని ఆహ్వానించకపోవడంపై స్పందిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని వెల్లడించింది. దేశంలో అనేక సమస్యలున్నాయని, వాటన్నింటినీ మోదీ అత్యంత దైర్యంతో ఎదుర్కొంటారని పేర్కొంది. రెండోసారి ప్రమాణంతో ఆయన దేశానికి రక్షణగా ఉంటానని శపథం చేస్తున్నారని తెలిపింది.