కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు…

120
  • గంగాపురం కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానమిదీ!

హైదరాబాద్, మే 30 (న్యూస్‌టైమ్): నరేంద్ర మోదీ తాజా మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్‌ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డికి చోటు లభించింది. మోదీతో పాటు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కిషన్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో హస్తిన వెళ్లిన ఆయన సాయంత్రం అందరితో కలిసి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ర్ట పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం నెలకొంది. కిషన్‌రెడ్డికి ఏ శాఖ అప్పగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

భాజపాలో సామాన్య కార్యకర్తగా మొదలై కేంద్రమంత్రి స్థాయి వరకు ఎదిగిన కిషన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పాలి. అధికారంతో నిమిత్తం లేకుండా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన అతికొద్ది మంది నాయకుల్లో కిషన్‌రెడ్డి ఒకరు. భారతీయ జనతాపార్టీలో కిషన్‌రెడ్డిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 1964 మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్‌రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్‌రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్). 1977లో జనతాపార్టీలో యువనాయకుడిగా ప్రవేశించి, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున తన సేవలు అందిస్తున్నారు.

1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టాడు. 1983 నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్షపదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను పొందారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను దక్కించుకున్నారు. 2004లో తొలిసారిగా హిమాయత్‌నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టగా, 2009 ఎన్నికలలో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 27000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొంది వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు.

శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్షనాయకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. 2010 మార్చి 6న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుండి పార్టీ పగ్గాలు స్వీకరించారు. 2014 ఎన్నికలలో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 62598 ఓట్ల మెజారిటీతో వరుసగా మూడోసారి ఘనవిజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టి తన సత్తాచాటుకున్నారు. అ తరువాత 2014లో మళ్లీ తెలంగణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున కిషన్‌రెడ్డి చేపట్టిన యాత్ర కేడర్‌లో మంచి ఊపుతెచ్చిందనే చెప్పాలి.

మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణ గ్రామం నుంచి జనవరి 19, 2012న భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించిన కిషన్‌రెడ్డి 22 రోజులపాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగించారు. పోరుయాత్ర ప్రారంభం రోజు కృష్ణ గ్రామంలో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ అప్పటి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హాజరయ్యారు. జయప్రకాశ్‌ నారాయణ్‌ స్ఫూర్తితో జనతాపార్టీలో యువ కార్యకర్తగా 1977లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1980లో భాజపాలో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. 1980 నుంచి 81 వరకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. 1982 నుంచి 83 వరకు బీజేవైఎం కోశాధికారిగా పనిచేశారు. 1986 నుంచి 90 వరకు ఉమ్మడి రాష్ట్రానికి బీజేవైఎం అధ్యక్షుడిగా పనిచేశారు. 1990 నుంచి 92 వరకు బీజేవైఎం అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు.

1992 నుంచి 94 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994 నుంచి 2001 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2001 నుంచి 2002 వరకు భాజపా రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2002లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. 2003 నుంచి 2005 వరకు భాజపా రాష్ట్ర అధికారప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004లో హిమాయత్‌నగర్‌ శాసనసభ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్‌విభజనలో భాగంగా హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం అంబర్‌పేటలోకి వచ్చింది. 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2009, 2014లో వరుసగా గెలుపొంది హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. శాసనసభలో భాజపా పక్షనేతగా కిషన్‌రెడ్డి పనిచేశారు.

2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ర్ట విభజన అనంతరం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా 2014 నుంచి 2016 వరకు పనిచేశారు. 2018లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి చేతిలో 1,116 ఓట్ల తేడాతో కిషన్‌రెడ్డి ఓడిపోయారు. నాలుగు మాసాల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అధికార తెరాస అభ్యర్థిపై 62,144 ఓట్ల భారీ మోజార్టీతో విజయం సాధించారు. తాజాగా కొలువుదీరిన కేంద్రమంత్రివర్గంలో కిషన్‌రెడ్డి స్థానం సంపాదించుకున్నారు.