ఏయూలో ఆసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

36

విశాఖపట్నం, మే 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం పీజీ కోర్సుల్లో, విజయనగరం గురజాడ అప్పారావు వర్సిటీలో పీజీ కోర్సులో, ఏయూ సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్‌, ఆఈట్‌ ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌ గురువారం ప్రారంభమైంది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రత్యేక విభాగాలయిన ఎస్‌సిసి, సిఏపి, దివ్యాంగులు, క్రీడాకారులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలకు కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. జూన్‌ 2 నుంచి 7వ తేదీ వరకు జనరల్‌ విభాగాలకు కౌన్సెలింగ్‌ జరుగుతుందని ప్రవేశాల సంచాలకులు ఆచార్య నిమ్మ వెంకట రావు తెలిపారు.

బుధవారం ఉదయం ఎన్‌సిసి, సైనికోద్యోగుల పిల్లల విభాగాలకు కౌన్సెలింగ్‌ జరిపారు. ఉదయం నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరారు. సర్టిఫీకేట్ల పరిశీలన ప్రక్రియను ప్రవేశాల సంచాలకులు ఆచార్య నిమ్మ వెంకటరావు పర్యవేక్షించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి దివ్యాంగులు, క్రీడాకారుల విభాగాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. 31న జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) విభాగాలకు సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహిస్తారు.

కాగా, జూన్‌ 2వ తేదీ నుంచి జనరల్‌ విభాగాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ సర్టిఫికేట్ల పరిశీలన జరుపుకోవాల్సి ఉంటుంది. అనంతరం జూన్‌ 3 నుంచి 8వ తేదీ వరకు విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. తొలి దశ సీట్లను జూన్‌ 11వ తేదీన వెల్లడిస్తారు. తొలి దశలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు జూన్‌ 11 నుంచి 13వ తేదీలోగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.