అగ్నిగుండంగా మారిన తెలుగు రాష్ట్రాలు

38

హైదరాబాద్, మే 27 (న్యూస్‌టైమ్): భానుడు నిప్పులు కక్కుతుండటంతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతూ 48 డిగ్రీలకు చేరువవుతున్నాయి. రోహిణి కార్తె ఆరంభం రోజు నుంచే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమికి జనం సతమతమవుతున్నారు. అత్యధికంగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా నేరెళ్లలో 47.3 డిగ్రీలు, ఇదే జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లిలో 47.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పెద్దపల్లి జిల్లా రామగుండం, జగిత్యాలలోని మేడిపల్లిలో 47 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా వెల్గనూర్‌లో 46.8 డిగ్రీలు, జగిత్యాల ధర్మపురిలో 46.6 డిగ్రీలు, పెద్దపల్లిలోని జూలపల్లిలో 46.4 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద నాగారంలో 46.2 డిగ్రీలు, కరీంనగర్‌లోని దుర్షేడ్‌లో 46.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా సిరికొండ, నల్లగొండ జిల్లా గుర్రంపోడులో 46.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఎండలు ముదురుతున్నాయి.

ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతూ సాయంత్రం 5 దాటినా నగరం చల్లబడకపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అయితే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నదని, జల్లులు పడితే ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈనెల 28వరకు వేడిగాలులు వీయనున్నట్టు వెల్లడించారు.

దీని ప్రభావంతో వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 42.2 డిగ్రీల గరిష్ఠం, 29.7డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 24శాతంగా నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు, వడదెబ్బకు తెలంగాణ రాష్ట్రంలో శనివారం తొమ్మిదిమంది మరణించారు.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారానికి చెందిన దొమ్మటి రాజమ్మ(48), కమాన్‌పూర్‌కు చెందిన జంగపెల్లి పోశం(65), కరీంనగర్ జిల్లా గోపాల్‌రావుపేటకు చెందిన దాసరి శ్రీనిత(11), జమ్మికుంటలో పోచమ్మ(70), మంచిర్యాల జిల్లా భీమారంలో రాజుబాయి(65), జగిత్యాల జిల్లా రాంపూర్‌కు చెందిన శ్రీగాదె లక్ష్మీనారాయణ(50) మరణించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగుకు చెందిన సజ్జనపు స్వామి(45), నిజామాబాద్ జిల్లా శాపూర్‌లో కుర్మె గంగు(65), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొగరాలగుప్పకు చెందిన కీసరి వెంకటేశ్వర్లు(45) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.

కాగా, ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులు తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వచ్చే రెండు రోజులు కూడా వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 6 నుంచి 7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వారు పేర్కొన్నారు. వడగాడ్పులు కారణంగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది.