‘సబ్‌ ప్లాన్‌’ రాజకీయాలు

310

హైదరాబాద్, మే 27 (న్యూస్‌టైమ్‌): స్సీ, ఎస్టీల సంక్షేమంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వర్గాల కోసం కేటాయిస్తున్న ఉప ప్రణాళిక నిధులను పాలకులు ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వల్లెవేస్తున్న దళిత జనోద్ధరణ కాగితాలకే పరిమితమైందన్న వాదనలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులను ఇతర శాఖలకు మళ్లించకుండా చూసేందుకు ఈ వర్గాల సముద్ధరణ కోసం ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించారు.

ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో ఈ ప్రణాళిక కింద కేటాయించిన నిధులు దారిమళ్లాయని, తమ సర్కార్‌ ఉప ప్రణాళిక నిధులన్నీ ఈ వర్గాల అభ్యున్నతికే ఖర్చు చేస్తుందని అసెంబ్లీ ఎన్నికల నుంచి పదేపదే చెబుతూ వస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలకులు అనుసరించిన బాటలోనే టీఆర్‌ఎస్‌ సర్కారు కూడా పయనిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ముప్పై నెలలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల ఖర్చకు సంబంధించి నిబంధనలే రూపొందించలేదన్న వాదనలు ఉన్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే సర్కారుకు ఈ వర్గాల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధి ఏపాటితో అర్థం చేసుకోవచ్చిన విపక్షాలు, ఎమ్మార్పీఎస్‌ వంటి ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితుల పై చూపించే శ్రద్ధ, అధికారంలోకి వచ్చిన తర్వాత కనపరచడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో భారీగానే నిధులు కేటాయిస్తున్నారు. అయితే… ఖర్చు మాత్రం ఇదే స్థాయిలో జరగడం లేదు.

గత బడ్జెట్‌లో 24 వేల కోట్ల నిధులు కేటాయిస్తే, ఖర్చు చేసింది మాత్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలేనని లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 17 వేల కోట్ల నిధులను ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ కాకతీయకు 7,500 కోట్లను మళ్లించారన్న విమర్శలున్నాయి. అలాగే మిషన్ భగీరథకు, రవాణ శాఖకు మరో వెయ్యికోట్లు మళ్లించారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు కేసీఆర్‌ సరైన సమాధానం కూడా ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని బయటకు తీసేందుకు ఎమ్మార్పీఎస్‌ వంటి సంఘాలు ప్రయత్నిస్తున్న తరుణంలో విషయం తెలుసుకున్న కేసీఆర్‌ ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులతో హడావుడిగా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

నిధులు ఇతర శాఖలకు మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు సవరణలు తీసుకొచ్చే అంశంపై అధ్యయనం కోసం మంత్రులు చందూలాల్‌, కడియం శ్రీహరి నేతృత్వంలో రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నిధులను వేర్వేరు శాఖల ద్వారా కాకుండా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారానే ఖర్చు చేయించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ముప్పై నెలలుగా మిన్నకున్న ప్రభుత్వం ఇప్పుడు హడావుడి చేయడం కంటితుడుపు చర్యలే అన్న విమర్శలు ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల ఖర్చుపై ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే ఉద్యమం తప్పదని అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందో లేక నిధుల సక్రమ వినియోగానికి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.