క్యూ4లో ఎన్టీపీసీకి లాభాల పంట

128

న్యూఢిల్లీ, మే 27 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్టీపీసీ స్టాండలోన్ నికర లాభం భారీగా పుంజుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) చివరి త్రైమాసికం లేదా ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో రూ.4,350.32 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే కాలంలో రూ.2,925. 59 కోట్లుగానే ఉందని ఒక ప్రకటనలో ఎన్టీపీసీ తెలియజేసింది. దీంతో ఈసారి 48.7 శాతం లాభాలు పెరిగాయని పేర్కొంది. అయితే, ఆదాయం గతంతో పోల్చితే రూ.23,617.83 కోట్ల నుంచి రూ.22,545.61 కోట్లకు పడిపోయింది. ఈ క్రమంలో సంస్థాగత వ్యయం కూడా రూ.19,008.44 కోట్లకు పరిమితమైంది. నిరుడు రూ.20,229.26 కోట్లుగా ఉండటం గమనార్హం.

దీంతో రూ.1,221 కోట్ల మేర తగ్గిన ఈ వ్యయభారం సంస్థ లాభాల పురోగతికి దోహదం చేసింది. ఇదిలావుంటే మొత్తం గత 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ స్టాండలోన్ నికర లాభం 13.60 శాతం ఎగిసి రూ. 11,749.89 కోట్లను తాకింది. 2017-18లో ఇది రూ.10,343.17 కోట్లుగా ఉంది. ఆదాయం కూడా రూ.85,207.95 కోట్ల నుంచి రూ.92,179.56 కోట్లకు పెరిగింది. ఏకీకృత నికర లాభం విషయానికొస్తే 2017-18లో రూ.10,501.50 కోట్లుగా ఉంటే, 2018-19లో రూ. 12,633.45 కోట్లకు ఎగబాకింది. ఆదాయం రూ.89,641.59 కోట్ల నుంచి రూ.97,537.34 కోట్లకు పెరిగింది.

కాగా, గత ఆర్థిక సంవత్సరానికి (2018-19)గాను 25 శాతం తుది డివిడెండ్‌కు ఎన్టీపీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేశారు. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్‌కు రూ.2.50ను ప్రకటించారు. ఆగస్టులో జరిగే సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి ఈ డివిడెండ్ ఉండనుంది. ఇప్పటికే ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3.58 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలోనే ఈ చెల్లింపులు జరిగిపోగా, దానికి ఈ తుది డివిడెండ్ అదనం కానుంది.

కాగా, ఎన్టీపీసీ డివిడెండ్‌లను చెల్లించడం వరుసగా ఇది 26వ సంవత్సరం కావడం గమనార్హం. 2018-19లో 305.90 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని ఎన్టీపీసీ చేసింది. 2017-18లో ఇది 294.27 బిలియన్ యూనిట్లుగానే ఉంది. ఎన్టీపీసీ గ్రూప్ మొత్తం విద్యుదుత్పాదక సామర్థ్యం ఈ మార్చి 31 నాటికి 55,126 మెగావాట్లుగా, నిరుడు మార్చి ఆఖరుకు రూ.53,651 మెగావాట్లుగా ఉంది.