మరింత పెరగనున్న పెట్రో భారం

120

న్యూఢిల్లీ, మే 26 (న్యూస్‌టైమ్): ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు పెట్రో ధరల సెగలు వెరసి వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల పుణ్యమాని బ్రేక్‌పడిన పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ మొదలవగా, వరుసగా మూడు రోజుల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 38 పైసలు, డీజిల్‌పై 40 పైసల భారం పడింది. శనివారం ఒక్కరోజే అటు పెట్రోల్ ధర 14 పైసలు, ఇటు డీజిల్ వెల 13 పైసలు ఎగబాకాయి.

దీంతో లీటర్ పెట్రోల్ రూ.75.86కు, డీజిల్ రూ.72.40కు చేరాయి. అటు దేశ రాజధాని నగరం ఢిల్లీలోనూ పెట్రో మోత మోగుతుండగా, గడిచిన మూడు రోజుల్లో పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 37 పైసలు వడ్డించారు. శనివారం పెట్రోల్ రేటును 14 పైసలు, డీజిల్ ధరను 12 పైసలు పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్ పెట్రోల్ రూ.71.53, డీజిల్ 66.57 పలుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఎగబాకుతుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో భారతీయ చమురు దిగుమతులపై పెరిగిన ఒత్తిడి తదితర అంశాలు దేశీయ మార్కెట్‌లో ధరల పెంపునకు దారితీస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అదీగాక ఎన్నికల కారణంగా నిలిచిన ధరల సవరణతో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలు రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ ఎలా ఉన్నా పెంపును కొనసాగించవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇక రోజూ పెట్రో బాదుడు ఉంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.