నాగార్జునకు ప్రేమలేఖ రాసిన అమల!

57

హైదరాబాద్, మే 26 (న్యూస్‌టైమ్): టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ఆయన భార్య అమల ప్రేమలేఖ రాశారు. అదేంటి? వాళ్లు పెళ్లి చేసుకొని చాలా ఏళ్లు అయింది కదా? ఇప్పుడు అమల నాగార్జునకు ప్రేమలేఖ రాయడమేందని ఆశ్చర్యపోతున్నారా? అవును! ఆమె నిజంగానే నాగార్జునకు ప్రేమలేఖ రాశారు. కానీ, దానికి ఓ సందర్భం ఉంది.

అది మే 23, 2019న నాగార్జున సినిమాల్లోకి ప్రవేశించి 33 ఏళ్లు అయిందట. ఆ సందర్భంగా నాగార్జున తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నటించిన సినిమాలను విశ్లేషిస్తూ నాగార్జునతో కలిసి పంచుకున్న అనుభవాలను ఆమె నాగార్జునకు ప్రేమతో ఓ లేఖ రాశారు. ఓ అభిమానిగా అమ‌ల త‌న‌ను ఎంత‌గా ప్రేమిస్తున్నారో ఎంత‌గా ఆరాధిస్తున్నారో ఆ లేఖ‌లో వివ‌రించారు.

ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మరి, తన ముద్దుల భర్తకు ఆమె ప్రేమతో ఏం రాశారో ఆమె మాటల్లోనే చదువుదాం పదండి. ‘‘నా హీరో, నా భర్త, నా స్నేహితుడా, నువ్వు నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డావు. నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగావు. నువ్వు స్క్రీన్ మీదికి వస్తే చాలు నేను ఇప్పటికీ నా చూపును తిప్పుకోలేకపోతున్నా. ఇప్పటికీ నీ నవ్వును చూడటం కోసం నా గుండె కొట్టుకోవడం కూడా ఆపేస్తుంది. నీ స్టయిల్, నీ కళ్లలోని మెరుపులు మరిచిపోలేను. సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ నువ్వు అందంగా తయారవుతున్నావు. ఎంత కష్టమొచ్చినా భయపడకూడదని, ప్రతి సవాల్‌ను ధైర్యంతో ఎదుర్కోవాలని చెబుతావు. ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని చెపుతూ నువ్వే ఒక ఉదాహరణ అవుతావు.

ప్రతి సారి నువ్వు నటించే సినిమాల విడుదల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాను. ఈసారి ఎలా స్క్రీన్‌పై కనిపిస్తావో అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తా. మిస్టరీనా? రొమాన్సా? యాక్షన్‌తో కూడిన కామెడినా? లేక ఆధ్యాత్మికతో కూడినదా? అని నేను ఎదురుచూస్తా. నాకు నువ్వు వేంకటేశ్వరస్వామి, రాముడు, షిరిడీ సాయిబాబాను దర్శించుకునే భాగ్యం కల్పించావు. ఇప్పుడు వాళ్లు మన కుటుంబంలో భాగం. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తావు, నీ బెస్ట్‌ను నువ్వు అందిస్తావు.

ఎప్పుడూ సిగ్గు పడవు. నీ ప్రొడ్యూసర్‌కు కష్టాలు రానివ్వవు. నువ్వే నా మ్యాజిక్. ఆ మ్యాజిక్ నీలో ఉంది. 33 ఏళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నువ్వు 95 సినిమాలతో ఏదో మ్యాజిక్ సృష్టించావు. అందుకు నీకు అభినందనలు. ఇలాగే ఇంకా ఎన్నో దశాబ్దాలు క్లింట్ ఈస్ట్‌వుడ్, బచ్చన్, ఏఎన్‌ఆర్‌లా సినిమా కుటుంబంలో వెలుగొందాలని మనసారా కోరుకుంటున్నా’’ అంటూ ప్రేమతో నీ అభిమాని, అమల అని ముగించారు.