22కు చేరిన సూరత్ మృతులు

44
  • కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్

సూరత్, మే 25 (న్యూస్‌టైమ్): గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం సాయంత్రం ఓ కోచింగ్ సెంటర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య శనివారం నాటికి 22కి చేరింది. ఈ ప్రమాదంలో శుక్రవారం 20 మంది మరణించగా, శనివారం మరో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని సూరత్ పోలీస్ అధికార ప్రతినిధి, ఏసీపీ పీఎల్ చౌధురి వెల్లడించారు. ఇప్పటివరకు 18 మంది అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు మృతిచెందారని తెలిపారు. 3-4 ఏళ్ల వయసున్న బాలిక తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

చాలా మంది బాధితులు 17-18 ఏళ్ల మధ్య వయసువారేనని ఆయన పేర్కొన్నారు. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్లు సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మ వెల్లడించారు. కోచింగ్ సెంటర్ యజమాని అయిన భార్గవ్ భుటానీని ఇప్పటికే అరెస్ట్ చేశామని, ఆ భవనాన్ని నిర్మించిన ఇద్దరు బిల్డర్లు హర్షుల్ వెకారియా, జిగ్నేశ్ పలివాల్ పరారీలో ఉన్నారని చెప్పారు. వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. సూరత్‌లోని కోచింగ్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అగ్నికీలలు, దట్టమైన పొగ కారణంగా పలువురు మృతిచెందగా, తప్పించుకునే యత్నంలో భవనంపై నుంచి దూకి మరికొంత మంది చనిపోయారు. అగ్నికీలల నుంచి తప్పించుకునేందుకు కనీసం 10 మంది మూడు, నాలుగో అంతస్తుల నుంచి కిందకు దూకారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అగ్ని ప్రమాదంలో మరణించిన 20 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు శనివారం ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. మృతుల్లో 18 మంది అమ్మాయిలు ఉన్నారని, వీరిలో 15 ఏళ్ల అమ్మాయి పిన్న వయస్కురాలు కాగా, 22 ఏళ్ల అమ్మాయి పెద్ద వయస్కురాలని పీఎస్ చౌధురి చెప్పారు.

సూరత్ ఘటనలో అగ్నిమాపక సిబ్బందిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవనంలో మంటలు ఎగిసిపడుతున్నా చాలాసేపటికి కానీ అగ్నిమాపక సిబ్బంది రాలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఫైర్ స్టేషన్ ఉన్నప్పటికీ ప్రమాద స్థలానికి రావడానికి 45 నిమిషాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. సకాలంలో వచ్చి ఉంటే మరింత మందిని రక్షించేవారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరత్ అగ్నిప్రమాద ఘటనలో తన ప్రాణాలకు తెగించి విద్యార్థులను కాపాడిన యువకుడిపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఆ యువకుడిని కేతన్ జొరావాడియాగా గుర్తించారు. మంటలు ఎగిసిపడడంతో నాలుగు అంతస్తులో ఉన్న కేతన్ సాహసం చేసి, మూడో అంతస్తులోని ఎడ్జ్‌పైకి చేరగలిగాడు. అదేవిధంగా ఓ యువతిని రక్షించే ప్రయత్నం చేయగా, పట్టుతప్పి ఆ యువతి కిందకు పడిపోయింది. అయినప్పటికీ, మరో ఇద్దరు యువతులను అతడు చాకచక్యంగా రక్షించగలిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, ఇద్దరు యువతులను రక్షించిన కేతన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.