తుఫాన్‌ ముందర ప్రశాంతం!

199

దేశాన్ని ఒకపక్క ఉగ్రవాద భూతం భయపెడుతుంటే రెండోవైపు మావోయిస్టుల సమస్య భద్రతా బలగాలను కలవరపెడుతోంది. మావోయిస్టులు ఎప్పటికప్పుడు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తుండడం భద్రతా వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు అన్నల పేరు వింటనే ప్రజాప్రతినిధులు గడగడలాడేవారు. సరైన భద్రత లేకుండా అడుగు తీసి అడుగు వేయకపోయేవాళ్లు.

విధ్వంసాలతో పోలీసులకు సవాల్‌ విసిరేవాళ్లు నక్సల్స్‌. కానీ, ప్రస్తుతం సీన్‌ పూర్తిగా మారిపోయిందా? అన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మావోయిస్టులంటే వేళ్లమీద లెక్కబెట్టవచ్చనే పరిస్థితి వచ్చిందన్నది ప్రభుత్వ వాదన. తెలుగు రాష్ట్రాల్లోనైతే అసలు ఉనికే లేకుండా చేశామని ప్రకటించుకున్నారు పోలీసులు. మరి ఇదంతా ఒక యాంగిల్‌ మాత్రమేనా? మావోయిస్టుల మరో యాంగిల్‌ ఏంటి? వాళ్లు ఏం చేయబోతున్నారు. కొంతకాలంగా వరుస ఎదురు దెబ్బలతో కుదేలైన మావోయిస్టులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి మౌనం వెనుక వ్యూహం ఏంటి? సరికొత్తగా ధ్వంస రచనకు ప్లాన్‌ చేస్తున్నారా? రిక్రూట్‌మెంట్లతో రివర్స్‌ అటాక్‌ మొదలు పెట్టబోతున్నారా?

దండకారణ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌కు మావోయిస్టులు ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు? సమాచార హక్కు చట్టంతో బయటకు వచ్చిన నిజాలు చూస్తే ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే. నల్లమల నుంచి అబూజ్‌మడ్‌కు షిఫ్టైన మావోయిస్టు అగ్రనేతలు పక్కాగా ప్లాన్‌ చేసుకున్నారు. గ్రీన్‌ హంట్‌కు రివర్స్‌ ఎటాక్‌ మొదలు పెట్టారు. ఆపరేషన్‌ రెడ్‌తో స్పీడ్‌ పెంచారు. రెడ్‌ జోన్‌ కేంద్రంగా రిక్రూట్‌మెంట్‌తో ఎదురుదాడి మొదలు పెట్టారు. చేరికల వివరాలు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. రోజుకు ముగ్గురు చొప్పిన సంవత్సరానికి 4 వేల మందిని చేర్చుకునేలా ప్లాన్‌ చేశారు.

ఇందుకోసం 489 ట్రైనింగ్‌ క్యాంపులు నిర్వహించారు. ఇలా ఏకంగా 10 ఏళ్లలో 40 వేల మందిని మావోయిస్టులుగా చేర్చుకున్నారు. మూడు రాష్ట్రాల్లోనూ బలపడాలనేది ఈ రిక్రూట్‌మెంట్ల్‌ వెనక వ్యూహంగా కనిపిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌ వివరాలన్నీ ఎవరో సాదాసీదాగా చెబుతున్నవి కావు. లేదంటే అంచనా వేసే అబూతకల్పనా కాదు. ఏకంగా మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి హోంశాఖ చెప్పిన వివరాలివి. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ఓ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానంలో మైండ్‌ బ్లాంక్‌ అయ్యే అంశాలున్నాయి. రోజుకు ముగ్గురిని చేర్చోకవడమే లక్ష్యంగా సాగిన రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ అంతా చాపకింద నీరులా ముగిసింది. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ట్రైనింగ్‌ క్యాంపులు నిర్వహించి టాస్క్‌ను సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు.

మావోయిస్టుల స్కెచ్‌ పోలీసులను హడలెత్తిస్తోంది. పదేళ్ల కిందట 16 రిక్రూట్‌మెంట్‌ క్యాంపులతో మొదలు పెట్టిన మావోయిస్టులు వాటిని క్రమంగా విస్తరించారు. ఎనిమిదేళ్లలో ట్రైనింగ్‌ క్యాంపుల సంఖ్యను 93కు పెంచారు. దీన్ని బట్టే వాళ్ల ప్లానింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి గత పద్దెనిమిదేళ్లలో 489 రిక్రూట్‌మెంట్‌ క్యాంపులు నిర్వహించారు. వీటిద్వారా 40 వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. నల్లమల నుంచి దండకారణ్యానికి షిఫ్ట్‌ అయిన మావోయిస్టు అగ్రనేతలు తమ దృష్టంతా రిక్రూట్‌మెంట్‌పైనే సారించారు. ఛత్తీస్‌గడ్‌, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో భారీగా క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

విప్లవాన్ని నూరి పోశారు. ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 200 క్యాంపులు ఏర్పాటు చేసి 20 వేల మందిని రిక్రూట్‌ చేశారు. జార్ఖండ్‌లో 136 క్యాంపులతో 12 వేల582 మందిని, ఒడిశాలో 56 క్యాంపుల ద్వారా 4వేల 136 మందికి ట్రైనింగ్‌ ఇచ్చారు. ఆయుధాలు, రాకెట్‌ లాంఛర్లు ఉపయోగించడంలో తర్ఫీదునిచ్చారు. ఇవన్నీ హోంశాఖ ఇచ్చిన అధికార లెక్కలు మాత్రమే. నిజానికి ఇంతకంటే పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్స్‌ జరిగి ఉండొచ్చని మావోయిస్టు సానుభూతిపరులు చెబుతున్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో భారీ అంతర్యుద్ధం తప్పకపోవచ్చు. ఇదే విషయంపై కలవరపడుతున్నారు పోలీసులు.

భారీగా రిక్రూట్‌మెంట్లు చేసుకుంటున్న మావోయిస్టులు. వాళ్లందరికీ ఏం నేర్పిస్తారు? గెరిల్లా దళాలుగా ఎలా తీర్చిదిద్దుతారు? భద్రతా బలగాలు బదులిచ్చే సత్తా వీళ్లకు ఎక్కన్నుంచి వస్తుంది? ట్రైనింగ్‌లో ఏఏ అంశాలను వీళ్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు? మారణాయుధాలతో మాటేసి, వేటేసే నేర్పరితనం కొత్తగా చేరిన వాళ్లకు ఎలా వస్తుంది? ఒక్కమాటలో చెప్పాలంటే మావోయిస్టుల శిక్షణ తరగతులు కమాండోల తరహాలో ఉంటాయట. మావోయిస్టులుగా రిక్రూట్‌మెంట్‌ చేసుకున్న వారికి అగ్రనేతలు ప్రధానంగా రెండు రకాల శిక్షణ ఇస్తున్నారు. మెరుపు దాడులు చేయడంలో మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు.

శత్రువును దెబ్బతీయాలంటే అంతకన్నా ఎక్కువ బలం, బలగం ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. భద్రతా దళాలను ఎదుర్కొనేందుకు వాళ్లను మించిపోయేలా శిక్షణ ఇస్తున్నారు. కొత్తగా చేరిన వారితో కమాండోలకు మించిన కసరత్తు చేయిస్తున్నారు. గ్రేహౌండ్స్‌కు మించిన ప్లానింగ్‌తో దూసుకుపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ల్యాండ్‌ మైన్‌ పేల్చడం దగ్గర్నుంచి ఆటోమేటిక్‌ రైఫిల్స్‌ వాడకంలో సానపెడుతున్నారు. అనుకోకుండా పోలీసులంతా ఒకేసారి చుట్టుముడితే ఎలాంటి వ్యూహం అవలంబించాలో నేర్పుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మావోయిస్టుల ట్రైనింగ్‌ మిలటరీ తరహాలో సాగుతోంది. గ్రేహౌండ్స్‌ ను మించిన కఠోర శ్రమ కనిపిస్తోంది. టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తే గురి తప్పకూడదు.

ప్లాన్‌ చేస్తే ఫెయిల్యూర్‌ ఉండకూడదు. ఇదే తరహాలో మొత్తం శిక్షణ సాగుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లానింగ్‌. పర్ఫెక్ట్‌ టైమింగ్‌పై మొదట ట్రైనింగ్‌ ఇస్తారని సమాచారం. శత్రువు ఊహకు కూడా అందకుండా ప్లాన్‌ చేయడమే లక్ష్యంగా ఫేజ్‌ వన్‌లో శిక్షణ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక మావోయిస్టుల్లో కొత్తగా చేరిన వారికి రెండో రకమైన శిక్షణ చాలా ముఖ్యమైనదిగా చెబుతుంటారు. తుపాకీ పట్టడం, విధ్వంసం సృష్టించడం తొలిరౌండ్‌లో నేర్చుకున్నా వాటిని అమలు చేసేందుకు సంసిద్ధులను చేసేదే సెకెండ్‌ ఫేజ్‌ శిక్షణ. దీనివల్ల క్యాడర్‌ను మానసికంగా సిద్ధం చేస్తారు. విప్లవసాహిత్యం నూరిపోస్తారు.

రక్త సంబంధాలు, సెంటిమెట్లను పూర్తిగా తుడిచిపెడతారు. భయాలు, బంధాలు లేకుండా తెంచేస్తారు. సమాజంలో జరుగుతున్న దోపిడీలు, కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి అంశాలను ప్రస్తావిస్తారు. వీటన్నింటినీ అరికట్టాలంటే తుపాకీ పట్టదనే విధంగా తర్ఫీదునిస్తారు. రెండో దశ శిక్షణ ముగిసిన వాళ్లందర్నీ కదనరంగంలోకి దింపుతారు. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ఇటీవల హెలికాప్టర్లు వాడుతున్నారు. పక్కాప్లాన్‌తో గుళ్లవర్షం కురిపిస్తున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు కూడా కొత్తవారికి అగ్రనేతలు పక్కా శిక్షణ ఇస్తున్నారు. హెలికాప్టర్‌ తరహాలో ఏర్పాట్లు చేసి దానిపై దాడి చేసే వ్యూహం నేర్పుతున్నారు. ఆత్మరక్షణ చేసుకుంటూనే పోలీసులపై దాడి చేసే అంశంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇలాంటి ట్రైనింగ్‌ ఉన్నతాధికారులనే నివ్వెరపరచింది.

హెలికాప్టర్లపై గతంలో మావోయిస్టులు దాడులకు ప్రయత్నించినా అలాంటివి ఏనాడూ సఫలం కాలేదు. తుపాకుల తూటాలు వాటికి సమీపంలోకి కూడా వెళ్లకపోయేవి. ప్రస్తతం ట్రైనింగ్‌ చూస్తుంటే కొంత అప్రమత్తంగా ఉండాల్సిందనేని కొందరు పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిసింది. క్యాడర్‌ను ఎంచుకోవడంలోనూ మావోయిస్టుల ప్లాన్‌ పక్కాగా ఉంటోంది. యూత్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా టినేజర్లను ఎంచుకుంటున్నారు. సొసైటీపై విసిగిపోయి విద్యా, ఉద్యోగం లేకుండా నిరాశ నిస్పృహల్లో ఉన్నవాళ్లు విప్లవానికి తొందరగా దగ్గరవుతారు. మావోయిస్టుల టార్గెట్‌ కూడా ఇలాగే ఉంది.

టీనేజ్‌లోతొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఏదైనా చేసేయగలం అనే భావనలో ఉంటారు. ఆ ఎమోషన్స్‌నే మావోయిస్టు టాప్‌ లీడర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అడవులు మరోసారి ఎరుపెక్కబోతున్నాయా? రెడ్‌ హంట్‌ గ్రీన్‌హంట్‌ పేరుతో నెత్తురోడటం ఖాయమా? దీన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు గ్రీన్‌హంట్‌ను మించిన వ్యూహం రచిస్తారా? లేదంటే ఈ రెండు ఆపరేషన్ల పేరుతో అమాయకులను పరేషాన్‌ చేస్తారా? మూడు రాష్ట్రాల్లో బలపడటంతో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌ అవడమే ఆలస్యమా? అంటే సమాధానం అవును అనే వస్తోంది.

మిస్సింగ్‌ లిస్టులో ఉన్నవాళ్లతో పాటు మరికొంత మంది రంగంలోకి దిగే ప్రమాదం ఉందని పసిగట్టారు పోలీసులు. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మావోయిస్టుల ఏరివేతకు పెట్టిన పేరు యూపీఏ హయాంలో మొదలైంది ఈ గ్రీన్‌ హంట్‌. సరైన అవకాశం కోసం ఎదురు చూసిన పోలీసులు. హోంశాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో రంగంలోకి దిగారు. సైన్యం సహాయంతో పెద్ద ఎత్తున కూంబింగ్‌ చేపట్టారు. హెలికాప్టర్లతోనూ దాడులు చేశారు. దొరికిన వారిని దొరికినట్లు ఏరిపారేశారు. అపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మావోయిస్టుల ఉనికికే సవాల్‌గా మారింది. భారీ ఎత్తున క్యాడర్‌ను నష్టపోయింది. చాలా మంది అగ్రనేతలను కోల్పావాల్సి వచ్చింది. వీటికి తోడు వరుస లొంగుబాట్లు మావోయిస్టులను కుదేలు చేసింది.

ఇక చేసేదేమీ లేదన్నట్లుగా వ్యూహాత్మక మౌనం వహించారు మావోయిస్టులు. పోలీసులను ఎదుర్కోవాలంటే రిక్రూట్‌మెంట్‌ ఒక్కటే మార్గమని గ్రహించారు మావోయిస్టులు. ఇందుకు తగ్గట్లే భారీ స్కెచ్‌ వేసినట్లు కనిపిస్తోంది. మోస్ట్‌ వాంటెడ్‌ లీడర్స్‌ అంతా ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి కామ్‌గా లక్ష్యం చేరేలా ప్రణాళిక అమలు చేసినట్లు కనిపిస్తోంది. దండకారణ్యంలో మంచి పట్టున్న దంతేవాడ, సుక్మా, నారాయణపూర్‌, బొకారో అడవుల్లో ధ్వంస రచనకు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. యువతను పెద్ద ఎత్తున ఆకర్శించి ట్రైనింగ్‌ ఇచ్చారు. ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. సమీప ప్రాంతాల ప్రజలు, సానుభూతి పరులను ఇందుకోసం ఉపయోగించుకున్నట్లు సమాచారం.

అగ్రనేతలంతా అండర్‌ గ్రౌండ్‌కు వెళ్లిపోవడంతో మావోయిస్టుల కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇది ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ విజయమేనంటూ భద్రతా దళాలు భావించాయి. అటు కేంద్ర ప్రభుత్వమూ తమ ఘనతగా చెప్పుకుంది. అసలు విషయం వారికి అర్థం కాలేదు. మావోయిస్టులు సైలెంట్‌ గా వేసిన స్కెచ్‌ ను పసిగట్టలేకపోయారు. ఆపరేషన్‌ రిక్రూట్‌ మెంట్‌ ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌కు రివర్స్‌ అటాకేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ ఎత్తున రిక్రూట్‌ మెంట్‌ జరిపిన మావోయిస్టులు భద్రతా దళాలపై ఎదురుదాడికి దిగడమే లక్ష్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు. తెలంగాణ, ఏపీలోనూ మళ్లీ మావోయిస్టుల అలజడి మొదలవుతోంది. పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇరు రాష్ట్రాల్లో చాలా కాలంగా మావోయిస్టుల ఉద్యమం స్తబ్ధుగా ఉంది. దీంతో ఛత్తీస్‌గడ్‌, ఒడిషా నుంచి మావోయిస్టు దళాలు ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ సహా ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు సమాచారం. పోలీసుల రికార్డుల ప్రకారం 340 మంది మావోయిస్టులు మూడేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టుకలిగిన వీళ్లంతా ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌, ఒడిషా రాష్ట్రాల్లో కీలక హోదాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

వీరు తిరిగి సొంతగడ్డపై అడుగుపెడితే మావోయిస్టుల ఉద్యమం జోరందుకునే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే అప్రమత్తమైంది. సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోకి అడుగు పెట్టే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్‌ వాహనాలను గాలిస్తున్నారు.. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు పోలీసులు. అటు మావోయిస్టులు కూడా ఆధునిక పరిజ్ఞానంతో దాడులు చేయాలనే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. మావోయిస్టుల రెడ్‌ హంట్‌కు పోలీసులు ఎలాంటి సమాధానం చెబుతారు? గ్రీన్‌హంట్‌ ముందు మావోయిస్టుల వ్యూహాలు ఫలిస్తాయా.

వీళ్లద్దరి మూలంగా అడవిలో అమాయక గిరిజనులు బలవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని పోలీసులు ఎలాగైనా మరోసారి పుంజుకోవాలని మావోయిస్టులు. ఇలా ఎత్తుకుపైఎత్తుకు వేస్తూనే ఉన్నారు. ఒకసారి పోలీసులు కోలుకోలేని దెబ్బతీస్తుండగా. మరోసారి మావోయిస్టులు ప్రతీకార దాడులు చేస్తున్నారు. మరి తాజా వ్యూహాలు ఎక్కడికి దారితీయనున్నాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.