రాహుల్ నాయకత్వం కాంగ్రెస్‌కు అవసరం: సీడబ్ల్యూసీ

91

న్యూఢిల్లీ, మే 25 (న్యూస్‌టైమ్): లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో మరోసారి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నైతిక బాధ్యతతో తన పదవి నుంచి వైదొలుగుతానని పట్టుబట్టారు. అయితే శనివారం ఢిల్లీలో జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ రాజీనామా ప్రతిపాదనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ‘‘ప్రస్తుత సంక్లిష్ట సమయంలో రాహుల్ గాంధీ మమ్మల్ని ముందుకు నడపాల్సిన అవసరముంది’’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశానంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగాల్సిందిగా పార్టీ ఆయనకు విజ్ఞప్తి చేసిందని, సంస్థాగతంగా పార్టీలో భారీ మార్పులు చేసే అధికారాన్ని రాహుల్‌కు కల్పిస్తూ సీడబ్ల్యూసీ సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై సీడబ్ల్యూసీ పూర్తిస్థాయిలో ఆత్మపరిశీలన చేస్తుందని చెప్పారు. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మేమే బాధ్యత వహిస్తాం. కానీ రాహుల్ నాయకత్వం మా పార్టీకి అవసరం’’ అని సుర్జేవాలా స్పష్టం చేశారు. అయితే గత (2014) లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్పంగా 44 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం 8 సీట్లను మాత్రమే పెంచుకోగలిగినప్పటికీ ఈ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన మరీ అంత దారుణంగా ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతానని రాహుల్ గట్టిగా పట్టుబట్టారని, సాధారణ కార్యకర్తగా పార్టీకి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అగ్రనాయకత్వానికి చెప్పినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ నాయకత్వం గురించి ఈ సమావేశంలో చర్చించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోనీ చెప్పారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ పనితీరు బాగుందని సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రతి ఒక్కరూ ఆయన (రాహుల్)తో చెప్పారు. అయితే పరిస్థితులే బాగాలేవు. ఇటువంటి సంక్లిష్ట సమయంలో పార్టీకి, ప్రతిపక్షానికి రాహుల్ మాత్రమే నాయకత్వం వహించగలరు’’ అని మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు.

లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష నేతను నియమించేందుకు అవసరమైనన్ని సీట్లను రాబట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ విఫలమవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు గంటలకే రాహుల్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఆ ప్రతిపాదనను యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తిరస్కరించారు. రాహుల్ రాజీనామా ప్రతిపాదనపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో సోనియాతోపాటు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ, సీనియర్ నేతలు పి. చిదంబరం, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, షీలా దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా రింది.